బాబు అరెస్టుపై కిషన్ రెడ్డి రియాక్షన్ వైరల్!
ఈ సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి... చంద్రబాబు అరెస్టుపై లైట్ గా స్పందించారు
By: Tupaki Desk | 12 Sep 2023 7:44 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కారణం... అరెస్టైంది మాజీ ముఖ్యమంత్రే కాదు, ఎన్డీయే లో ఒకప్పుడు కన్వీనర్ కూడా!
అవును... ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో చక్రాలు గట్రా తిప్పిన బాబు... రాష్ట్రపతులను సైతం నియమించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ అనేది రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తు పొడుపులపై తీవ్ర చర్చ నడుస్తున్న సమయమంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి నుంచి రియాక్షన్ వచ్చింది.
ఏపీలో టీడీపీ అధినేత, బీజేపీ పాత మిత్రుడు చంద్రబాబు అరెస్టైన సమయంలో ఆ పార్టీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆన్ లైన్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీజేపీ ఖండిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షం జనసేన అయితే... సంపూర్ణంగా ఖండించారు. తమ మద్దతు చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఉంటుందన్న స్థాయిలో ఆ పార్టీ అధినేత స్పందించారు.
ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనదైన శైలిలో స్పందించరు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సింపతీ వస్తుందేమో అనే ఆలోచన లేకుండా ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేయడాన్ని ఏపీ సర్కార్ సాహసంగా ఆయన అభివర్ణించారు. పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఏ ప్రభుత్వమూ ఎన్నికల ముందు అంత రిస్క్ చేయదని తెలిపారు.
ఈ సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి... చంద్రబాబు అరెస్టుపై లైట్ గా స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీ మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నంతవరకే తనకు తెలుసని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తానింకా చూడలేదని స్పందించారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ముందస్తు నోటీసులు, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆమె చెప్పిందని అన్నారు. అయితే తానింకా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోలేదన్నట్లుగా కిషన్ రెడ్డి స్పందించారు! దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో... చంద్రబాబు నాయుడు అంతటి వ్యక్తి అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే, 14 రోజుల పాటు రిమాండ్ ని కోర్టు విధిస్తే, పైగా అది వందల కోట్ల స్కాం కు సంబంధించిన విషయం అయితే... కేంద్రంలోని కీలక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రానికి బీజేపీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి... రియాక్షన్ ఇంతేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా... ఏపీ రాజకీయాల విషయంలో బీజేపీ పెద్దలు ఎంత జాగ్రత్తగా స్పందిస్తున్నారనేది తెస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది!