'కనువిందు - పసందు'... హైదరాబాద్ లో కైట్ & స్వీట్ ఫెస్టివల్!
ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్...!
By: Tupaki Desk | 13 Jan 2025 7:47 AM GMTవిశ్వనగరంగా అభివృద్ధి చెందిన, మరింత చెందుతున్న హైదరాబాద్ లో సంక్రాంతి వేళ అటు కనులకు, ఇటు జిహ్వకు సంతోషాన్నీచ్చే.. సంక్రాతి సంబరాలను అంబరానికి తీసుకెళ్లే విధంగా ఏడో ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్...!
అవును... ఏడో ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్ ఫెస్టివల్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి నుంచి 15వ తేదీ వరకు (భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో) సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేకతలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి సుమారు 47 మంది అంతర్జాతీయ, 14 రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ క్లబ్ సభ్యులు గాలిపటాలు ఎగురవేయనున్నారు. సంక్రాంతి సంబరాలను అంబరానికి తీసుకెళ్లే ఈ కార్యక్రమానికి సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక స్వీట్ల విషయానికొస్తే... ప్రపంచంలోని సుమారు 10 దేశాలకు, దేశంలోని సుమారు 25కు పైగా రాష్ట్రాలకు చెందిన స్వీట్లతో పాటు తెలంగాణ సంప్రదాయ స్వీట్లకు సంబంధించిన 1000 వరకూ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చేనేత, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించనున్నారు.
ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఫెస్టివల్ కార్యక్రమానికి చెందిన వివరాలు తెలియజేశారు. ఈ ఫెస్టివల్ లో అందరికీ ప్రవేశం ఉచితం అని.. అందరూ ఆహ్వానితులే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హైద్రబాద్ లోనే కాకుండా.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని నిర్వహిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా స్పందించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్య్దర్శి స్మితా సబర్వాల్... తెలంగాణ విశిష్టతను చాటిచెప్పే ఈ ఉత్సవం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక కార్యక్రమం అని అన్నారు.