Begin typing your search above and press return to search.

సంచలన సర్వే సంస్థ కేకే.... ఢిల్లీలో రివర్స్ అలా ఏలా?

ఈ సమయంలో పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2025 3:06 PM GMT
సంచలన సర్వే సంస్థ కేకే....  ఢిల్లీలో రివర్స్  అలా  ఏలా?
X

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసిన రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సమయంలో పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా... భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో గెలిచి విజయబావుటా ఎగురవేయగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని పరిస్థితిలో నిలవడం గమనార్హం. ఈ విషయంలో కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు వెలువడ్డాయి. ఆ సంగతి అలా ఉంటే... 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో.. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కేకే సర్వే ఫలితాలు ఢిల్లీ ఎన్నికల్లో రివర్స్ అయ్యాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కేకే సర్వే సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తొలుత చాలా మంది నమ్మలేదనే చెప్పాలి. మరీ ఆ స్థాయిలో ఉంటాయా ఫలితాలు అనే చర్చా జరిగింది. మరోపక్క.. టీడీపీ - జనసెనలకు అనుకూలంగా ఈ సంస్థ పనిచేసిందనే చర్చా నడిచింది.

మరోపక్క బెట్టింగుల వ్యవహారమా అనే కామెంట్లూ వినిపించాయి. ఈ నేపథ్యంలో 151 సీట్లు సాధించిన వైసీపీ 10 నుంచి 15 సీట్లు రావడం ఏమిటంటూ చాలా మంది కేకే సర్వేను లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే.. ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైంది.. దీంతో ఒక్కసారిగా కేకే సర్వే సంస్థ పేరు మారుమ్రోగిపోయింది.

ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న కేకే సర్వే సంస్థ.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైనా అంచనాలు వెల్లడించిందనే విషయం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా.. ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 44 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశం ఉందని.. భారతీయ జనతాపార్టీ దాదాపు 26 సీట్ల వరకూ దక్కించుకునే అవకాశం ఉందని కేకే సర్వే అంచనా వేసింది!

దీంతో... అప్పటి వరకూ బీజేపీకి అనుకూలంగా కనిపించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల నడుమ ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే... తాజాగా వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో కేకే సర్వే అంచలనాలను తలకిందులు చేస్తూ అన్నట్లుగా బీజేపీ పార్టీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. ఆప్ 22 స్థానలకు పరిమితమైంది. దీంతో.. ఢిల్లీలో కేకే సర్వే అంచనాలు తలకిందులు అయ్యాయి ఎలా అనే చర్చ నెట్టింట మొదలైందని అంటున్నారు!