వైసీపీని ముంచింది వాలంటీర్లేనంటోన్న వైసీపీ నేత
ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థి కేకే రాజు వెల్లడించారు.
By: Tupaki Desk | 6 Jun 2024 9:40 AM GMTదేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఏపీలో తీసుకువచ్చిన ఘనత తమదేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. గడపగడపకు ప్రభుత్వ పథకాలను పాలనను అందిస్తుంది వాలంటర్లేనని వారికి సన్మానాలు, సత్కారాలు కూడా జగన్ చేసేవారు. అయితే, ఎన్నికల వేళ తమకు బ్రహ్మాస్త్రంగా మారతారు అనుకున్న వాలంటీర్లు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలతో ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారడంతో వైసీపీకి షాక్ తగిలింది. ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థి కేకే రాజు వెల్లడించారు.
వాలంటీర్లే పార్టీ ఓటమికి కారకులయ్యారని విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కుటుంబానికి వాలంటీర్ల వల్ల మేలు జరిగిందని, నేరుగా ప్రజలతో వారు కనెక్ట్ అయి పథకాలు అందించారని రాజు చెప్పారు. కానీ, పార్టీ పరంగా వాలంటీర్ల వల్ల వైసీపీ నేతలు చాలా నష్టపోయారని రాజు కుండబద్దలు కొట్టేశారు. ప్రజలకు....వైసీపీ నాయకులకు, వైసీపీ కేడర్ కు మధ్య సంబంధాలు తెగిపోవడానికి వాలంటీర్లు కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లతో అన్ని పనులు అవుతున్నాయని, దీంతో జనాలకు నాయకుడి అవసరం లేకుండా పోయిందని రాజు చెప్పారు. నేరుగా ప్రజలతో టచ్ లోకి వెళ్లి వారికి సేవ చేసే అవకాశం లేకుండా చేసింది వాలంటీర్ల వ్యవస్థని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టేసరికి లబ్ధిదారులను గుర్తించి వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లేందుకు సమయం సరిపోలేదని చెప్పుకొచ్చారు. లబ్ధిదారులు అందరిని కలిసి తమకు ఓటు వేయాలని చెప్పేసరికి పుణ్యకాలం గడిచిపోయిందని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ పార్టీని నిలువునా దెబ్బ కొట్టిందని, అందుకే ఈరోజు ఈ స్థితి వచ్చిందని రాజుతో పాటు చాలామంది వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు, పార్టీ క్యాడర్ తో ఎమ్మెల్యేలకు...సీఎం కోటరీతో ఎమ్మెల్యేలకు చాలా గ్యాప్ ఉందని, ఇది కూడా ఓటమికి కారణమని అనుకుంటున్నారు.