3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి.. కొడాలిలో అదే ఫైర్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తనలో ఫైర్ తగ్గలేదని నిరూపించారు.
By: Tupaki Desk | 18 Feb 2025 10:45 AM GMTమాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన తనలో ఫైర్ తగ్గలేదని నిరూపించారు. తన సహచరులను అరెస్టు చేస్తున్నా, తాను మాత్రం ఎవరికీ తలవంచనని తేల్చచెప్పారు. మూడు కాదు ముప్ఫై కేసులు పెట్టుకోండి.. లాయర్లు ఉన్నారు వారే చూసుకుంటారంటూ ధీమా వ్యక్తం చేశారు. చాలాకాలం తర్వాత కొడాలి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి కొడాలి నాని తగ్గేదేలే అంటున్నారు. తన సన్నిహిత మిత్రుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు తర్వాత కొడాలి భయపడుతున్నారనే ప్రచారాన్ని కొట్టిపడేశారు. నెక్ట్స్ కొడాలి అరెస్టు అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోనని చెప్పారు. తాను గతంలో పెద్దగా కనిపించకపోవడానికి కారణం కూడా ఆయన తెలిపారు. విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ తోపాటు కొడాలి కూడా వచ్చారు. అయితే కొడాలిని జైలు అధికారులు అనుమతించకపోవడంతో బయటే ఉండిపోయారు.
చాలా కాలం తర్వాత కొడాలి కనిపించడంతో మీడియా ఆయనపై ఫోకస్ చేసింది. ఓ మహిళా మీడియా ప్రతినిధిని ఇదే విషయమై కొడాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కనిపించడం మానేశారంటూ అడిగే సరికి కొడాలి తన సహజ ధోరణిలో సమాధానమిచ్చారు. తన ఉద్యోగం పీకేశాక బయటకు వచ్చి ఏంచేస్తానంటూ వివరణ ఇచ్చారు. మీ ఉద్యోగం లేకపోతే ఇలా మైకులు పట్టుకుని తిరుగుతారా? అంటూ ఎదురుప్రశ్న వేశారు. అంతేకాకుండా చంద్రబాబు, ఏబీఎన్ రాధాక్రిష్ణ, టీవీ 5 నాయడులకు రోజూ వచ్చి కనిపించాలా? అంటూ నిలదీశారు.
ఇక మంత్రి లోకేశ్ రెడ్ బుక్ పైనా కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు నన్నేమీ చేయలేవన్నారు. మీపై మూడు కేసులు నమోదయ్యాయి కదా? అంటే మూడు కాదు ముప్ఫై కేసులైనా పెట్టుకోమని సవాల్ విసిరారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు చిన్న విషయంగా ఆయన తేల్చిచెప్పారు. మొత్తానికి కొడాలి భయపడుతున్నారంటూ ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి ఆయన ఈ రోజు స్పష్టమైన సమాధానం చెప్పినట్లైంది. ఎవరిని అరెస్టు చేసినా ఫర్వాలేదని తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక అట్టుకు అట్టున్నర, రెండు, మూడు తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత జగన్ ను మళ్లీ సీఎం చేయడమే తమ టార్గెట్ అని కొడాలి తెలిపారు.
వంశీ అరెస్టు తర్వాత కొడాలి అరెస్టు అనే ప్రచారం నడుమ మాజీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఆకర్షించాయి. సుమారు 9 నెలల తర్వాత కొడాలి యాగ్రసివ్ గా మాట్లాడటం వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులకు ధైర్యం వచ్చిందని అంటున్నారు. ఇక కొడాలి వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తునేది ఆసక్తికరంగా మారింది.