Begin typing your search above and press return to search.

సొంత ఊరుకు సంక్రాంతికి కొడాలి దూరం ?

రాజకీయాలు అంతే. ఎవరిని అయినా ఎక్కడ నుంచి ఎక్కడో కూర్చోబెడతాయి. మళ్ళీ ఆ ఎవరెస్ట్ నుంచి ఏమీ కాకుండా పాతాళానికి పడదోస్తాయి

By:  Tupaki Desk   |   4 Jan 2025 3:47 AM GMT
సొంత ఊరుకు  సంక్రాంతికి  కొడాలి  దూరం ?
X

రాజకీయాలు అంతే. ఎవరిని అయినా ఎక్కడ నుంచి ఎక్కడో కూర్చోబెడతాయి. మళ్ళీ ఆ ఎవరెస్ట్ నుంచి ఏమీ కాకుండా పాతాళానికి పడదోస్తాయి. అందుకే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్న స్పృహ ఉండాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నపుడు ఇంకా చాలా ఈ విచక్షణ అవసరం ఉంటుంది.

చేతిలో పవర్ ఉంది కదా అని అందరినీ ఆడిపోసుకున్నా స్థాయి మరచి కొందరిని టార్గెట్ చేసినా చివరికి మిగిలేది తిప్పలే అని వైసీపీ నేతలు కొందరు ఉదంతం స్పష్టం చేస్తోంది. ఎలా ఉండాల్సిన కొడాలి నాని ఎలా అయిపోయారు అన్న చర్చ అయితే సాగుతోంది.

ఆయనకు భయం అన్నది బ్లడ్ లో లేదు అని అనుచరులు అభిమానులు తెగ చెప్పుకుని మురిసేవారు. ఆయన కూడా ఎవరైనా సరే రెడీ అన్నట్లుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దూకుడు చేసేవారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే ఆ ఫైర్ కి మీడియా మైకులే హీటెక్కిపోయేవి. టీవీలలో సోషల్ మీడియాలో కొడాలి నాని ప్రెస్ మీట్లు చూసిన వారికి సైతం ఆ వేడి అలా పాకేసేది.

అంతలా మాటలతో దూకుడు చేసిన కొడాలి నాని పెట్టుకున్న ధీమాలు అన్నీ 2024 ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిగా సడలిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని కొడాలి నాని చాలా ఎక్కువగా నమ్మేవారు. అంతే కాదు గుడివాడ జనానికి తాను అంటే ఎంతో అభిమానమని తాను ఎప్పటికీ మాజీ ఎమ్మెల్యేను కాను అని కడు నమ్మకంగా ఉండేవారు.

ఈ రెండూ తప్పు అంటూ గుడివాడ జనం తీర్పు ఇచ్చేవారు. గుడివాడలో కొడాలి నాని పునాదులే కదిలిపోయేలా 2024 ఎన్నికల్లో తీర్పు వచ్చింది. ఎన్నారై అయిన వెనిగండ్ల రాము చేతిలో పరాజయం పాలు అయ్యారు. ఆయన వాడిన భాషను సహించలేకనే జనాలు ఈ తీర్పు ఇచ్చారు అని అంటున్నారు. చంద్రబాబు పట్ల జనానికి పూర్తి వ్యతిరేకత ఉందని ఆయన్ని టార్గెట్ చేసుకుంటే తనకు తిరుగు ఉండదని కొడాలి నాని వేసుకున్న అంచనాలు తప్పు అని కూడా నిరూపించారు.

ఓటమి తరువాత చూస్తే కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. ఆయన అభిమానులు అనుచరులు సైతం ఇదే విషయం చర్చించుకునేలా ఇది ఉంది అంటున్నారు. కొడాలి ఫైర్ బ్రాండే కాదు, ఫియర్ లెస్ అన్న బ్రాండ్ కూడా ఉంది. దానికి భిన్నంగా ఇపుడు ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది.

ఆయనకు గుడివాడ అంటే చాలా ఇష్టం. అక్కడ ప్రజలతో ఆయన పూర్తిగా మమేకం అవుతారు. ఆయన నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా మూడేళ్ల పాటు పనిచేశారు. అయినా ఆయన ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే టీ స్టాల్స్ వద్ద సాదర జనంతో కలసి టీ తాగుతారు, వారితో ముచ్చట్లు పెడతారు. ఎవరి ఇంటిలోకైనా చాలా సులువుగా వెళ్ళి అక్కడ కూర్చుని వారి మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటారు.

బహుశా ఈ నైజమే ఆయనను తిరుగులేని నాయకుడిగా గుడివాడలో నిలబెట్టింది అని అంటారు. అటువంటి కొడాలి నాని తాను అమితంగా ప్రేమించే గుడివాడను, అక్కడ ప్రజలను కూడా దూరం చేసుకుని ఏడు నెలలుగా వేరే చోట ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఆయనకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఆ పండుగ వేళ ఆయన తన సొంత నియోజకవర్గంలో ఉంటారు.

ఆయన మంత్రిగా పనిచేసిన తరువాత మొదటి ఏడాది జనవరిలో వచ్చిన సంక్రాంతి పండుగకు నాటి సీఎం జగన్ ని తన గుడివాడ నియోజకవర్గానికి తీసుకుని వచ్చి ఎడ్ల పందాలు ఇతర కార్యక్రమాలు ప్రారంభించారు. అదే విధంగా అయిదేళ్ల పాటు చేశారు. అయితే ఈ ఏడాది సంక్రాతి పండుగకు కొడాలి నాని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

పైగా ఆయన ఈ మధ్య కాలంలో గుడివాడ కూడా రాలేదని అంటున్నారు. మరి తెలుగు వారికి పెద్ద పండుగ నానికి ఎంతో ఇష్టమైన గుడివాడలో జరుపుకుంటారా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళకు అయినా ఆయన సొంత ఊరుకు వస్తారా అని అనుచరులతో సైతం అంతా చూస్తున్నారు. అయితే నాని ప్రధాని అనుచరుడు కాళి అరెస్ట్ అయిన నేపథ్యంలో కొడాలి నాని మీదకే అందరి ఫోకస్ ఉంటుందని అందువల్ల అరెస్ట్ భయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికే మరో మాజీ మంత్రి కొడాలి స్నేహితుడు అయిన పేర్ని నాని కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి. దాంతో కొడాలి నాని ఈ సంక్రాంతికి సొంత వూరుకీ సంక్రాంతి పండుగకూ దూరంగానే ఉంటారు అని కూడా అంటున్నారు. కొడాలి నాని వచ్చి సందడి చేస్తే మాత్రం అది సంచలన వార్తే అవుతుంది అని అంటున్నారు.