Begin typing your search above and press return to search.

గుండుతో ఫైర్ బ్రాండ్...వాటే చేంజ్ ?

కొడాలి నాని పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత ఆయన చుట్టూ ఇంత నిశ్శబ్దం మేము ఎరగమని అనుచరులు అభిమానులే అంటున్నారు

By:  Tupaki Desk   |   16 Oct 2024 7:26 AM GMT
గుండుతో ఫైర్ బ్రాండ్...వాటే చేంజ్ ?
X

ఆయన ఫైర్ బ్రాండ్. మీడియా ముందుకు వస్తే ప్రత్యర్ధులకు బాండే. పదునైన తన విమర్శలతో పాటు ఘాటు మాటలతో మసాలా కలిపి దట్టించడంతో ఆయన సిద్ధహస్తుడు. ఆయనే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని.

ఒక్క ఓటమి ఆయనలో ఎంతో మార్పు తెచ్చినట్లుంది. అందుకే మీడియాకు దూరంగా గత నాలుగు నెలలుగా ఉంటూ వస్తున్నారు. అంతే కాదు ఫుల్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. కొడాలి నాని పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత ఆయన చుట్టూ ఇంత నిశ్శబ్దం మేము ఎరగమని అనుచరులు అభిమానులే అంటున్నారు

ఇంతకీ ఆయన బెజవాడలో ఉంటున్నారా లేక హైదరాబాద్ లో ఉంటున్నారా అన్నది కూడా ఎవరికీ తెలియడం లేదు. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలో ఉంది. ఆయనను గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక వరసబెట్టి నాలుగు సార్లు గెలిచిన గుడివాడలో ఆయన ఫస్ట్ టైం పరాజయం పాలు అయ్యారు.

ఎన్నారై రాము ఆయనను ఓడించారు. మెల్లగా వైసీపీని వీక్ చేసే పనిలో కూడా ఆయన బిజీగా ఉన్నారు. గుడివాడలో అందరికీ దన్నుగా ఉంటూ క్యాడర్ కి భరోసా ఇవ్వాల్సిన నాని మాత్రం అక్కడకు పెద్దగా రావడం లేదు అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కొడాలి నాని అకస్మాత్తుగా తిరుమల గిరుల వద్ద ప్రత్యక్షం అయ్యారు. అది కూడా ఎవరూ గుర్తు పట్టలేనంతగా. ఆయన ఎపుడూ పెద్ద జుత్తుతో పాటు పెరిగిన గడ్డం మీసాలతో కనిపిస్తారు. అలాంటిది గుండుతో మొత్తం మీసాలు గడ్డాలు తీసేసి కనిపించారు. తెల్లని బట్టలు ధరించిన నాని నుదుటిన బొడ్డుతో ప్రసన్న వదనంతో ఒక స్వామీజీ మాదిరిగా కనిపించారు. దాంతో ఆయనను చూసిన వారు అంతా ఈయనేనా కొడాలి నాని అని చూసి కూడా పోల్చుకోలేకపోయారుట.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నాని. తల నీలాలు సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఆయన ముఖంలో ఫైర్ కి బదులు చిరునవ్వు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నపుడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసే ఫైర్ బ్రాండ్ నానికీ ఇపుడు సైలెంట్ గా ఉన్న గుండు నానికీ ఎంతో తేడా ఉందని అంటున్నారు.

ఒకే ఒక్క ఓటమి నానిని అలా మార్చేసింది అని అంటున్నారు. ఆయన మీడియాకు దూరంగా ఉంటూ తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు, వైసీపీ కష్టకాలంలో ఉన్న వేళ ఆయన పార్టీ భుజం కాయడం లేదు. గుడివాడ రాజకీయాన్ని కాస్తా పక్కన పెట్టేశారు.

రాజకీయాల జోలికి ఇప్పట్లో వెళ్ళకూడదని అనుకుంటున్నారో లేక ఈ మౌనం వెనక వ్యూహాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ నాని మాత్రం సైలెంట్. ఆయనలో ఇంత చేంజ్ ని చూసిన వారు వామ్మో అనుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నానిని అరెస్ట్ చేస్తుందని గతంలో ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇపుడు ఆ హడావుడి అయితే తగ్గింది. మరీ నానిని కూటమి పట్టించుకుంటుందా కోరి తట్టి లేపి హీరోని చేస్తుందా లేక అలా సైలెంట్ గానే ఉండిపోతే లాభం అనుకుంటుందా. చూడాలి మరి ఏమి జరుగుతుందో.