కొడాలి కోర్టు యాత్ర.. ఈ సారి ఏ కేసు అంటే..
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. మచిలీపట్నం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
By: Tupaki Desk | 19 March 2025 2:00 PM ISTవైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. మచిలీపట్నం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. తనపై నమోదైన కేసులో సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని తెలపడంతోపాటు విచారించాల్సివస్తే ముందుగా నోటీసు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను వరుసగా అరెస్టు చేస్తున్నారు. రకరకాల కేసుల్లో గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందంటున్నారు. ఈ క్రమంలో కూటమి పెద్దలకు టార్గెట్ గా చెబుతున్న మాజీ మంత్రి కొడాలి అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనపై వరుస కేసులు నమోదు అవుతుండగా, రెండింట్లో ముందస్తు బెయిల్ మంజూరు కాగా, విశాఖలో నమోదైన కేసులో నోటీసులివ్వాలని కోర్టు సూచించింది.
ఇక మచిలీపట్నంలో నమోదైన కేసులో కొడాలిని అరెస్టు చేస్తారనే భయం పట్టుకుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఆయన తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడితోపాటు గుడివాడ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, భూకబ్జాలపైనా కొడాలిపై కేసులు నమోదు చేయనున్నారని అంటున్నారు. దీంతో ఆయన ఒక్కో కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో కొడాలి రెండు మూడు సార్లు మాత్రమే బయటకు వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరుకావడం లేదు.