కొడాలి.. కింకర్తవ్యం? టీడీపీలో ఒకటే తర్జనభర్జన!
ఈ మూడు కేసులు కాకుండా కొడాలిపై మరే బలమైన కేసు లేకపోవడంతో నెక్ట్స్ కొడాలి అన్న టార్గెట్ ను పోలీసులు చేరుకోలేకపోతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Feb 2025 2:45 AM GMTవైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అంశంపై అధికార పార్టీ టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోందని అంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత తమ నెక్ట్స్ టార్గెట్ కొడాలి అంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేశారు. అయితే ఆయన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి కొడాలిపై తీవ్రమైన కేసులు లేకపోవడం, ఉన్న కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడంతో కొడాలి మిస్ అయ్యారంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి లోకేశ్ టార్గెట్ గా కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారని విమర్శలు ఉన్నాయి. ఆ కారణంగా కొడాలిని టార్గెట్ చేసుకున్న టీడీపీ నేతలు.. ఆయన కోసం అలుపులేని వేట కొనసాగిస్తున్నారు. కానీ, వారికి ఇంతవరకు సరైన ఆధారాలు లేకపోవడంతో కొడాలిని టచ్ చేయలేకపోతున్నారని అంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని నోటికి అడ్డూ అదుపు లేకుండా ఉండేదని విమర్శలు ఉన్నాయి. ఓ విధంగా ఆయన మాటలే వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ చేసిందనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తనకు గట్టి మద్దతుదారుగా అధినేత జగన్ మాజీ మంత్రి కొడాలికి వెన్నుదన్నుగా నిలుస్తూనే ఉన్నారు. దీంతో కొడాలి కూడా కూటమి ప్రభుత్వాన్ని ధైర్యంగా ఢీకొడుతున్నారు. ఆయనపై ప్రస్తుతం మూడు కేసులు నమోదవగా, కొన్నాళ్లుగా అండర్ గ్రౌండ్ కి వెళ్లారని చర్చ జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో విజయవాడ వచ్చిన కొడాలి.. తాను అందుబాటులో లేకపోవడానికి తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. తన ఉద్యోగం పీకేసిన తర్వాత కనిపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన కొడాలి.. తనను అరెస్టు చేస్తామంటున్న కూటమి నేతలకు సవాల్ విసిరారు. మూడు కాదు ముప్ఫై కేసులు పెట్టుకున్నా తాను భయపడనని, తగ్గేదేలే అని ప్రకటించారు.
కయ్యానికి కాలు దువ్వినట్లు కొడాలి సై అంటున్న.. టీడీపీ మాత్రం ప్రస్తుతం సైలెంటుగా ఉంటోందని అంటున్నారు. దీనికి కారణం కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ప్రస్తుతానికి టీడీపీకి కనిపించకపోవడమే అంటున్నారు. కొడాలి మంత్రిగా ఉండగా, గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, ఈ విషయంపై పెద్ద రాద్ధాంతం చేసింది. కానీ, అధికారంలోకి వచ్చాక ఈ దిశగా ముందడుగు వేయలేకపోతుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఎన్నికల అనంతరం కొడాలిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వలంటీర్లు కొడాలిపై ఫిర్యాదు చేయగా, బలవంతంగా మద్యం గిడ్డంగిని ఖాళీ చేయించారని మరో ఫిర్యాదు వచ్చింది. ఈ రెండు ఫిర్యాదులపై ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు లోకేశ్, పవన్ కల్యాణ్ లను దుర్భాషలాడారని విశాఖలో లా విద్యార్థిని ఒకరు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా కేసు ఒకటి నమోదైంది.
ఈ మూడు కేసులు కాకుండా కొడాలిపై మరే బలమైన కేసు లేకపోవడంతో నెక్ట్స్ కొడాలి అన్న టార్గెట్ ను పోలీసులు చేరుకోలేకపోతున్నారని అంటున్నారు. బియ్యం కేసు, మైనింగు కేసు అంటూ ఏవేవో లీకులిస్తున్నా.. వాటికి ఆధారాలు లేకపోవడం వల్ల కొడాలి విషయంలో ముందడుగు పడటం లేదంటున్నారు. దీంతో ఇన్నాళ్లు కాస్త భయపడినట్లు కనిపించిన కొడాలి కూడా.. తననేం చేయలేరనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే దూకుడు పెంచి కూటమికి సవాల్ విసురుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తానికి కొడాలి ఎపిసోడ్ కూటమికి ముఖ్యంగా టీడీపీకి సవాల్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.