కొడాలి నాని వర్సెస్ టీడీపీ.. బాబుకు మరో తలనొప్పి!
సోషల్ మీడియా లో దుర్భాషలు, పోస్టుల కేసులతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులను కూడా వడివడిగా ముందుకు తీసుకువెళ్తోంది.
By: Tupaki Desk | 1 Dec 2024 2:45 AM GMTవైసీపీ నాయకుడు, మాజీ మంత్రిఫైర్ బ్రాండ్ కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతల మధ్య రాజకీయ చిచ్చు రేగుతోంది. ఈ వివాదం.. సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకు లపై ఇప్పటికే కూటమి సర్కారు కేసులు నమోదు చేసింది. సోషల్ మీడియా లో దుర్భాషలు, పోస్టుల కేసులతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులను కూడా వడివడిగా ముందుకు తీసుకువెళ్తోంది.
ఈ క్రమంలో దర్శకుడు వర్మను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, సజ్జల రామ కృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలా.. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. కొడాలి నాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందన్నది.. టీడీపీ సీనియర్ల ప్రశ్న. తాజాగా సచివాలయంలో అందుబాటులో ఉన్న ఇద్దరు టీడీపీ మంత్రులను గుడివాడ టీడీపీ నేతల బృందం కలుసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో కొడాలి నానిపై నమోదైన కేసులు.. వాటి వివరాలను మంత్రులకు వివరించిం ది. తక్షణం కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఈ బృందం విన్నవించింది. అయితే.. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నారని, కొడాలి బాధితుల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది చంద్రబాబు, ఆయన కుటుంబమేనని.. కాబట్టి తొందర పడాల్సిన అవసరం లేదని మంత్రులు చెప్పారు. ఇదిలావుంటే, మరోవైపు.. గుడివాడలో నాని అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారంటూ.. పదుల సంఖ్యలో తాజాగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం భూములు తీసుకుని, వాటిని చదును చేసేపేరుతో సర్కా రు నుంచి సొమ్ములు కోట్ల రూపాయల్లో కొట్టేశారని ఆరోపించారు. వీటిపై పోలీసులు కేసులు నమోదు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీబృందం.. మంత్రులను కలుసుకోవడం.. కొడాలిపై కేసులు నమోదు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించడం గమనార్హం. అయితే.. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సరైన ఆధారాలు ఉంటే తప్ప.. చర్యలకు దిగేందుకు ఆయన సిద్దంగా లేరు.