కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుందా...!?
వైసీపీలో ఫైర్ బ్రాండ్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుందా అన్న చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 19 Feb 2024 12:01 PM GMTవైసీపీలో ఫైర్ బ్రాండ్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన కొడాలి నానికి బిగ్ షాక్ తగలనుందా అన్న చర్చ సాగుతోంది. దీనికి కారణం గుడివాడ ఎమ్మెల్యే సీటు విషయంలో వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచించడమే అని అంటున్నారు.
నానికి బదులుగా కొత్త అభ్యర్ధిని ఎంపిక చేస్తారు అని టాక్ నడుస్తోంది. గుడివాడలో సీనియర్ వైసీపీ నేత, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు తాజాగా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది అని ప్రచారంలో ఉంది. దాంతో ఏకంగా గుడివాడలో హనుమంతరావుకే సీటు అని ఫ్లెక్సీలు వేసేశారు.
ఇక గుడివాడలో కొడాలి నాని 2004 నుంచి ఓటమి ఎరగకుండా గెలుస్తున్నారు. ఆయన నాలుగు సార్లు అంటే రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో తానే పోటీ చేస్తాను అని ఆయన ధీమాగా ఉన్నారు. అలాగే నాని వర్గం కూదా అదే ఆశలతో ఉంది. గుడివాడ అంటే కొడాలి నాని అన్నట్లుగా ఉన్న ఈ సీటులో వేరే అభ్యర్ధిని అసలు ఊహించడమే కష్టం.
కానీ జగన్ ఈ సీటు విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంటారు. అదే విధంగా కాపులు ఎస్సీ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉంటారు.
టీడీపీ ఈసారి కమ్మ ప్లస్ ప్లస్ కాపు అన్న ప్రయోగంతో ముందుకు వెళ్తోంది. కమ్మ అభ్యర్ధిగా వెనిగండ్ల రాముని ఎంపిక చేసింది. ఇక కాపుల మద్దతు జనసేన రూపంలో ఉంటుందని లెక్కలేసి మరీ టీడీపీ వెనిగండ్లను రంగంలోకి దించుతోంది. అర్ధబలం, అంగబలం దండీగా ఉన్న ఈ ఎన్నారై తో కొడాలి నానికి చెక్ చెప్పాలని చూస్తోంది.
అయితే వైసీపీ చేసిన సర్వేలలో చూస్తే కొడాలి నానికి వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ప్రధానంగా చంద్రబాబు మీద కొడాలి నాని విరుచుకుపడుతున్న తీరుతో కమ్మలు అంతా వ్యతిరేకంగా మారారు అని అంటున్నారు. దాంతో పాటు ప్రతీసారి గుడివాడను సమర్ధించే కాపులలో కూడా చీలిక వస్తోందని, ఎస్సీ ఓట్లు కూడా టీడీపీకి టర్న్ అవుతాయని అంచనాలు ఉన్నాయని అంటున్నారు.
దాంతోనే గుడివాడలో కొడాలి నాని బదులుగా హనుమంతరావుని అభ్యర్ధిగా ప్రకటించవచ్చు అని అంటున్నారు. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అని అంటున్నారు గుడివాడలో అత్యధికంగా కాపుల ఓట్లు ఉన్నాయి. అలాగే వైసీపీ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ మైనారిటీలను కలుపుకుంటే విజయం సాధ్యమని ఊహిస్తున్నారు.
ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో చూస్తే గుడివాడ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది అని అంటున్నారు. కొడాలి నానికి టికెట్ దక్కదు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అది ఆయనకు బిగ్ షాక్ అని కూడా చెప్పవచ్చు అంటున్నారు. ఈసారి పోటీ చేసి రాజకీయాల నుంచి విరమించాలని నాని అనుకుంటున్నారు అని చెబుతున్నారు. మరి జగన్ ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి.