'కొడాలి నాని పంచాల్సిన డబ్బులు దోచేశారు'... వీడియో హల్ చల్!
ఎన్నికల సీజన్, అన్ సీజన్ అనే సంబంధాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది
By: Tupaki Desk | 19 May 2024 7:12 AM GMTఎన్నికల సీజన్, అన్ సీజన్ అనే సంబంధాలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. పోలింగ్ పూర్తయినా.. ఫలితాలకు ఇంకా సమయం ఉన్నా కూడా ఏపీ రాజకీయాలు చప్పబడే, చల్లబడే ప్రస్తక్తే లేదన్నట్లుగా సాగుతుంటుంది. ఈ సమయంలో గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని తరుపున పంచాల్సిన సొమ్మును కాజేశారంటూ ఒక వ్యక్తి ఆరోపిస్తున్న వీడియో తెరపైకి వచ్చింది.
అవును... ఓటర్లకు డబ్బు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ వైసీపీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ డబ్బులు తీసినవాళ్లు తప్పు ఒప్పుకుంటే సరేసరి కానీ.. తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వారిపై పెంపుడు కుక్కలను వదలాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... కొడాలి నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత సర్దార్ బేగ్. అందువల్ల.. ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణ మండపానికి పిలిపించి కొడాలి చిన్ని నిలదీయాలని సూచించారు. ఈ సమయంలో... నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయాలని సూచించారు.
డబ్బు ఇవ్వని వారిపైకి పెంపుడు కుక్కలను వదిలేయాలని అన్నారు. ఈ సందర్భంగా... నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12 వార్డుల్లోని వారున్నారని సర్దార్ బేగ్ అన్నారు. వారిని వేగంగా పిలిచి డబ్బులు వసూలు చేయాలని.. లేదంటే వారిలో ఒకరు గోవా, ఇంకొకరు సింగపూర్, మరొకరు మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో... ఎందుకూ పనికిరానోడి వద్ద కూడా రూ.50 వేల కట్టలు కనిపిస్తున్నాయి.. నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్లను తిన్నారా..? లేదా..? అని అడిగినవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. ఈ వ్యవహారంపై కొడాలి నాని & కో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.