కొడాలి నాని నామినేషన్ పై ఫిర్యాదు.. ఆర్వో నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ!
ఏపీలోని హాట్ టాపిక్ ని యోజకవర్గాల్లో గుడివాడ ఒకటనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 26 April 2024 9:31 AM GMTఏపీలోని హాట్ టాపిక్ ని యోజకవర్గాల్లో గుడివాడ ఒకటనేది తెలిసిన విషయమే. ఈసారి ఆరు నూరైనా నూరు ఆరైనా గుడివాడలో కొడాలి నానీని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుందని చెబుతున్నారు. అసెంబ్లీలో కొడాలి నానీ కనిపించకుండా చేయాలనేది టీడీపీ ప్రధాన కర్తవ్యాల్లో ఒకటి అని మరికొంతమంది చెబుతున్నారు. మరోపక్క అది చంద్రబాబు తరం కాదని కొడాలి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్కుల్లో ఒకటైన గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైసిపీ అభ్యర్థి కొడాలి నాని గురువారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీ ఎత్తున జరిగిన ర్యాలీలో వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో ఫోటో.. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ల ఫోటోలు దర్శనమిచ్చాయి. ఒకే ఫ్రేం లో జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ ల ఫోటోలు.. వాటి మధ్యలో వైఎస్ జగన్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి.
ఈ సందడి వాతావరణంలో.. కొడాలి నానీ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు సీట్లను ఎన్నారైలకు అమ్ముకున్నారని.. డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చారని ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో వచ్చి మళ్లీ ఎన్నికలు అయిపోగానే ఎన్నారైలంతా వెళ్లిపోతారని.. వాళ్లకు ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కౌంటింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ ఎన్నారై బ్యాచ్ అంతా ఎయిర్ పోర్ట్ లో ఉంటారని ఎద్దేవా చేశారు!
ఆ సంగతి అలా ఉంటే.... కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడిందని తెలుస్తుంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా... మున్సిపల్ కార్యాలయాన్ని పార్టీ క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్ లో పేర్కొన్నారని చెబుతున్నారు.
దీంతో... అత్యంత కీలక నియోజకవర్గం, అంతకు మించిన కీలక అభ్యర్థి విషయంలో ఇలాంటి విషయం తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో... కొడాలి నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.