Begin typing your search above and press return to search.

చిరంజీవిపై మరోసారి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసన్నారు. తామంతా స్పష్టతతోనే ఉన్నామని నాని తెలిపారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:25 AM GMT
చిరంజీవిపై మరోసారి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల సినిమా ఫంక్షన్‌ లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మెగాభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. సినిమా రంగంలో ఉన్న పకోడీ గాళ్లు కూడా ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ కొడాలి నాని.. చిరంజీవి పేరు ఎత్తకుండా ఘాటు విమర్శలు చేశారు.

కొడాలి నాని విమర్శలపై చిరు అభిమానులు గుడివాడలో నిరసనలకు దిగడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాని తన మాటలను జనసేన, టీడీపీ నేతలు వక్రీకరించారని తెలిపారు. కేక్‌ కట్‌ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు.

తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేనలకు బూతులానే వినిపిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసన్నారు. తామంతా స్పష్టతతోనే ఉన్నామని నాని తెలిపారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులున్నారని, తనకు, చిరంజీవికి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

తాను మెగాస్టార్‌ను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని సవాల్‌ విసిరారు. తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని వెల్లడించారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును తాను కాదన్నారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి తాను చేతులెత్తి నమస్కారం పెట్టానని నాని గుర్తు చేసుకున్నారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని చెప్పారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు తాము పాటిస్తామని నాని చెప్పడం విశేషం.

సీఎం జగన్‌ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదని కొడాలి నాని వార్నింగ్‌ ఇచ్చారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని ధ్వజమెత్తారు. తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలని మాత్రమే తాను చెప్పానన్నారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డ్యాన్సులు, యాక్షన్‌ రావా.. ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుందని నిలదీశారు.

గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 38 వేలకు పైగా ఉన్న కాపు ఓటర్లు ఈసారి దూరమయ్యే ప్రమాదం ఉండటంతోనే నష్టనివారణ చర్యలకు కొడాలి నాని దిగారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ సైతం ఈసారి కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నానికి చిరంజీవిపై ఆకస్మాత్తుగా ప్రేమ పుట్టడం సహజమేనని అంటున్నారు.