Begin typing your search above and press return to search.

సీఎంగా ఛార్జ్ తీసుకోగానే కొడాలి నానికి షాక్!

ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే కొడాలి నాని భద్రత విషయంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   13 Jun 2024 1:33 PM GMT
సీఎంగా ఛార్జ్  తీసుకోగానే కొడాలి నానికి షాక్!
X

ప్రధానంగా గత ప్రభుత్వంలో మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక వైరల్ టాపిక్ అనే చెప్పాలి. అయితే తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం స్థానంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ భారీ షాకిచ్చింది. ఇందులో భాగంగా నానీకి భద్రతను తొలగించారు!

అవును... మాజీమంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి భద్రతను తొలగించింది చంద్రబాబు ప్రభుత్వం! ఇప్పటివరకూ కొడాలి నాని ఇంటివద్ద ఉన్న భద్రతా సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ తొలగించారు! దీంతో... వారంతా వెనక్కి రానున్నారు. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే కొడాలి నాని భద్రత విషయంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే... సాధారణంగా ప్రభుత్వాలు మారిన సమయలో.. మాజీ మంత్రులకు భద్రతను ఉపసంహరించుకోవడం అత్యంత సహజం అని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరోపక్క ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొడాలి నాని నివాసం వద్ద తీవ్ర అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలుగు యువత కార్యకర్తలు కొంతమంది కొడాలి నాని ఇంటివద్దకు చేరి కోడిగుడ్లతో దాడి చేశారు. ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడంపై చర్చ మొదలైంది.

కాగా... గుడివాడలో తిరుగులేని నేతగా ఎదుగుతూ 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో 50వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయనకు భద్రతను ఉపసంహరించుకుంది.