షర్మిల ఎంట్రీ వేళ కొడాలి సంచలనం.. ‘క్షమాపణలు చెప్పాల్సిందే’
ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందన్న కొడాలి.. ఏపీ ప్రజల హక్కుల్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
By: Tupaki Desk | 5 Jan 2024 5:03 AM GMTతాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఆ పార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా లేవన్న ఆయన.. వైఎస్ కుమార్తె షర్మిల తాజాగా కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందన్న కొడాలి.. ఏపీ ప్రజల హక్కుల్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తర్వాతి కాలంలో దోషిగా చిత్రీకరించిందన్న కొడాలి నాని.. ‘‘వైఎస్ కుమారుడుజగన్ ను జైలుపాలు చేసింది’ అని వ్యాఖ్యానించారు. ఈ రెండు కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. వైఎస్ మరణం తర్వాత ఆయన్నే ముద్దాయిగా చూపించిన కాంగ్రెస్ పార్టీ తీరును తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దోషిగా చూపించిన కాంగ్రెస్.. ఏపీలో దాని ఉనికిని కాపాడుకోవాలంటే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ ను దోషిని చేశామని.. జగన్ ను జైల్లో పెట్టామని కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోవాలని.. ఏపీ ప్రజలకు అన్యాయం చేశామని క్షమాపణలు చెప్పాలని.. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఆ పార్టీకి జరిగే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. షర్మిలను ఉద్దేశించి ఒక్క విమర్శ చేయని కొడాలి నాని తెలివిగా కాంగ్రెస్ పై ఫైర్ కావటం ఆసక్తికరమని చెప్పాలి.