దాడులపై కొడాలి నాని ప్రెస్ మీట్... ఈ తేడా గమనించారా?
ఇదే సమయంలో జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేసినవారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా ఇంటికే పరిమితం అయిన పరిస్థితి.
By: Tupaki Desk | 8 Jun 2024 2:10 PM GMTఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో.. కొన్ని సందర్భాల్లో బూతులతో విరుచుకుపడటంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు కొడాలి నాని! ప్రధానంగా అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు జనసేన అధినేత, టీడీపీ యువనేత లోకేష్ లపై పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. కొన్ని సందర్భాల్లో మీడియా సైతం బీప్ వేసుకోవాల్సిన పరిస్థితి!!
కట్ చేస్తే... ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కూటమిగా ఏర్పడిన టీడీపీ & కో ఘన విజయం సాధించింది. నాటి అధికార పక్షం వైసీపీకి ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదే సమయంలో జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేసినవారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా ఇంటికే పరిమితం అయిన పరిస్థితి.
ఈ క్రమంలో... గతంలో ఆయా నేతలు చేసిన కవ్వింపు చర్యలు గుర్తుకువచ్చాయో.. లేక, తమ అధినేతపై చేసిన వ్యాఖ్యలు జ్ఞప్తికి వచ్చాయో తెలియదు కానీ.. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసింది తెలుగు యువత. ఈ సందర్భంగా ధమ్ముంటే బయటకురావాలంటీ ఫైర అయ్యింది. ఈ సమయంలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయనే కామెంట్లు వినిపించాయి!
ఈ పరిస్థితుల్లో తాజాగా మీడియా ముందుకు వచ్చారు మాజీమంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా తన ఇంటిపైనా, వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడులు జరిగాయని అన్నారు. టీడీపీ - జనసేన కార్యకర్తలు.. వైసీపీ కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారని.. ఈ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ రోజు కొడాలి నాని పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా ఒక్క బూతు మాట కూడా వినిపించకపోవడం! అవును... తమ ఇంటిపైనా, తమ పార్టీ కార్యకర్తలపైనా జరుగుతున్న దాడులపై స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన కొడాలి నాని.. గతంలో చూపించిన దూకుడు లేకుండా.. ఒక్క బూతు మాట లేకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ముగించారు!
దీంతో అధికారం పోగానే కొడాలికి తత్వం బోదపడినట్లుందని.. ఫలితంగా దూకుడు తగ్గి తెలుగు భాషలో బూతులు మ్యూట్ అనే విషయం తెలిసినట్లుందని ఒకరంటుంటే... తెలుగు యువత ట్రీట్ మెంట్ బాగా పనిచేసినట్లుందని మరికొందరు కామెంట్ చేస్తుండటం గమనార్హం!