కేసీఆర్ దూకుడు కోదండ రాం బ్రేకులు!
ఇక, డ్యాములు కుంగిపోవడం, మేడిగడ్డ అప్రాధాన్యం, కాళేశ్వరం వ్యవహారం ఇవన్నీ పొంచి ఉన్నాయి.
By: Tupaki Desk | 27 Jun 2024 3:48 AM GMTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దూకుడుకు తాజాగా ఆయన ఒకప్పటి మిత్రుడు, ఉద్యమ స్నేహి తుడు ప్రొఫెసర్ కొదండరాం బ్రేకులు వేస్తున్నారా? కేసీఆర్.. తనపై నమోదైన కేసులను కొట్టించేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కోదండరాం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా విద్యుత్ విషయంలో ప్రత్యేక కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేసమ యంలో సర్కారు కూడా కేసులు పెట్టింది.
ఇక, డ్యాములు కుంగిపోవడం, మేడిగడ్డ అప్రాధాన్యం, కాళేశ్వరం వ్యవహారం ఇవన్నీ పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్.. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టు గడప తొక్కారు. దీనిపై ప్రొఫెసర్ కోదండ రాం తనదైన శైలిలో స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎవరి మాటా వినకుండా.. తప్పుడు పనులు చేశారని.. తద్వారాప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందని అన్నారు. గత పదేళ్లుగా చేసిన తప్పుడు పనులపై కేసులు పెడితే.. వాటిని దీటుగా ధైర్యంగా ఎదుర్కొనాల్సిన కేసీఆర్.. ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యమని కోదండరాం నిప్పులు చెరిగారు.
ఇది దొడ్డిదారిలో తప్పులు అంగీకరించడమేనని అన్నారు. అయితే.. కేసీఆర్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తామని చెప్పిన ప్రొఫెసర్.. రేపు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించి.. కేసులు ఎత్తేసే పరిస్థితి వస్తే మాత్రం బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులు కూడా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతామన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ మాట పట్టించుకోకపోతే.. తదుపరి కార్యాచరణను రెడీ చేసుకుంటామని చెప్పారు. ఈ పరిణామంతో కేసీఆర్ ప్రయత్నాలకు కోదండరాం వ్యూహాత్మకంగా బ్రేకులు వేస్తున్నారనే చర్చసాగుతోంది.
ఇదేసమయంలో రేవంత్ సర్కారును కూడా అలెర్ట్ చేస్తున్నారా? అని భావిస్తున్నారు. కాగా.. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో చెట్టాపట్టాలేసుకుని మేధావులను కూడగట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన కోదండ రాం.. తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ప్రస్తుతం ఆయన ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.