Begin typing your search above and press return to search.

చడీచప్పుడు లేకుండా ప్రమాణం!

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశం దాదాపు రెండేళ్లుగా నలుగుతోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 7:01 AM GMT
చడీచప్పుడు లేకుండా ప్రమాణం!
X

ఇద్దరు ముఖ్యమంత్రులు.. ముగ్గురు గవర్నర్లు.. నలుగురు అభ్యర్థులు.. రెండు ప్రభుత్వాల మధ్య నలిగిన తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఎట్టకేలకు సుఖాంతమైంది. మీడియాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన రెండు రోజుల్లో.. చడీచప్పుడు లేకుండా.. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారమూ ముగిసింది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఆ తర్వాత తెలంగాణ జనసమితి పేరిట పార్టీ పెట్టిన ప్రొఫెసర్ కోదండరాం ఎట్టకేలకు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఆయన మంత్రి కావడమే మిగిలిందేమో?

అటు తిరిగి.. ఇటు తిరిగి

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశం దాదాపు రెండేళ్లుగా నలుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమిళిసై గవర్నర్ గా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన దగ్గర మొదలైంది మెలిక. ఆయన అభ్యర్థిత్వాన్ని తమిళిసై తిరస్కరించారు. అది సమసి పోయింది అనుకుంటుండగా.. దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జులైలో చేసిన సిఫార్సులను తమిళిసై రద్దు చేశారు. ఇక తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జనవరిలో ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమెర్‌ అలీఖాన్‌ లను ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణలు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోదండ, అలీఖాన్ నియామకాలను ఈ ఏడాది మార్చి 7న కొట్టివేసింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. కొత్తవారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని బుధవారం తోసిపుచ్చింది. ఈ నియామకాలను ఆపలేమని.. అలా చేస్తే గవర్నర్ హక్కులకు భంగకరమని పేర్కొంది.

హఠాత్తుగా.. అడ్డంకులు ఎదురవకుండా..?

బుధవారం సుప్రీం తీర్పు రావడంతోనే కోదండరాం, అలీఖాన్‌ ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి అడ్డంకులు తొలగినట్లైంది. అయితే, శుక్రవారం వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుల్లో మంచి పేరున్న కోదండరాం నియామకాన్ని ఎవరూ కాదనరు. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టారు. కేసీఆర్ తో కాస్త తేడా రావడమే దీనికి కారణం. దీంతో పదేళ్లుగా ఆయన ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ప్రతిగా ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. మరోవైపు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారంలో ఇకమీదట ఎలాంటి అడ్డంకులూ ఎదురవకూడదనే ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.