Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ సొంత ఇలాకలో 'ఫార్మా' రచ్చ

కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద ఒక మహిలా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు అయితే కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిని పరిగెత్తిస్తూ వెంటపడి దాడి చేయటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

By:  Tupaki Desk   |   12 Nov 2024 4:03 AM GMT
సీఎం రేవంత్ సొంత ఇలాకలో ఫార్మా రచ్చ
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి కారణం.. ఫార్మాకంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు.. మహిళలు ఆందోళన బాట పట్టటం.. గ్రామసభకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.. అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్.. కొడంగల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరగటమే దీనికి కారణం.

కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీకి అవసరమైన భూముల సేకరణ కోసం గ్రామసభను ఏర్పాటు చేశారు. పచ్చని పొలాల్లో విషం నింపేందుకు ఫార్మా కంపెనీని ప్లాన్ చేశారంటూ తీవ్ర ఆగ్రహాన్ని అక్కడి రైతులు వ్యక్తం చేశారు. భూసేకరణకు వచ్చిన కలెక్టర్.. రెవెన్యూ అధికారులను కర్రలు.. రాళ్లతో వెంటాడారు. వారు ప్రయాణిస్తున్న వాహనాల్ని ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కలెక్టర్ మీద మహిళా రైతు ఒకరు చేయి చేసుకోవటం సంచలనంగా మారింది. అయితే.. తనపై ఎవరూ దాడి చేయలేదని కలెక్టర్ పేర్కొనటం గమనార్హం.

కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద ఒక మహిలా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు అయితే కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిని పరిగెత్తిస్తూ వెంటపడి దాడి చేయటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి కలెక్టర్.. అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేసినా.. అక్కడి వాతావరణం సర్దుకోలేదు. ఈ మొత్తం పరిణామాలతో లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 1358 ఎకరాలను భూసేకరణ చేసేందుకు ఐదు నెలల క్రితం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంటే, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 721 ఎకరాలు పట్టా భూమి ఉంది. భూములు కోల్పోతున్న రైతులంతా పేద రైతులు.. వారిలో అత్యధికులు గిరిజనులే. ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ.. దాన్నే తమ జీవనోపాధిగా చేసుకున్న వారు. వీరిలో మొదట్నించి ఈ ప్రాజెక్టు మీద ఆందోళన నెలకొంది. అయితే.. అధికారులు మాత్రం భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నా.. చాలామంది వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పచ్చని పొలాల్లో విషాన్ని నింపే ఫార్మా కంపెనీలను ఒప్పుకోమన్నది అక్కడి వారి అభ్యంతరం. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తుననారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణ కోసం ముందుకు వెళ్లటం.. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. రైతుల అగ్రహాన్ని గుర్తించినప్పటికి.. వారిని సముదాయించటం.. ప్రత్యామ్నాయాల మీద సరైన కసరత్తు లేకుండానే భూసేకరణ ప్రక్రియను స్టార్ట్ చేయటం పెద్ద సమస్యగా మారింది.

మరోవైపు నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ మీదా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.30 లక్షలు ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఎకరానికి రూ.10 లక్షలు.. ఇంటికి ఒకరికి ఉద్యోగం.. ఎకరానికి 125 గజాల ప్లాటు.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినట్లుగా అధికారులు చెబుతున్నా.. వాటిపై ఆందోళనకారులకు సరైన అవగాహన లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రైతుల ఆందోళనను.. భయాల్ని.. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో నెలకొన్న గ్యాప్ తాజా పరిణామానికి కారణంగా చెబుతున్నారు. ఆందోళనల వెనుక విపక్షాల హస్తం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నెలకొన్న ఆందోళన.. చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేశాయని చెప్పక తప్పదు.