`కోడికత్తి` దూసుకున్న వైసీపీ-టీడీపీ!
ఈ వివాదానికి నేటితో(అక్టోబరు 25) ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి.
By: Tupaki Desk | 25 Oct 2024 9:28 AM GMTఏపీలో `కోడికత్తి` వ్యవహారం.. రాజకీయంగా మారిన విషయం తెలిసిందే. 2018, అక్టోబరు 25న విశాఖలోని విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై కోడికత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎడమ భుజానికి గాయం కావడం.. ఇది రాజకీయంగా రచ్చకావడం కూడా తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటూనే ఉన్నాడు.
కట్ చేస్తే.. ఈ వివాదానికి నేటితో(అక్టోబరు 25) ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో నాటి ఘటనకు సంబంధించిన రెండు ఫొటోలను పోస్టు చేశారు. ఒకవైపు విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి, మరోవైపు.. ఆసుపత్రి బెడ్‌పై జగన్ పడుకున్న దృశ్యాలను ఉంచారు. దీనికి.. ``హ్యాపీ కోడికత్తి డే`` అనే శీర్షిక పెట్టారు. అంతేకాదు.. ఆరేళ్ల కిందట తమరు(జగన్) ఇచ్చిన పెర్ఫార్మెన్స్.. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అన్నట్టుగా ఉందని పేర్కొన్నారు.
దీనికి వైసీపీ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో టీడీపీ ట్వీట్‌ను లింక్ చేస్తూ.. మన రాష్ట్రంలో కోడికత్తి లాంటి పదునైన ఆయుధంతో ఎవరిపైన దాడి చేసినా అది నేరంకాదని అధికార పార్టీ ప్రకటించిందంటూ.. వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అంతేకాదు.. కోడికత్తి దాడిలో గాయపడిన వారు చికిత్స కోసం.. ఆసుపత్రిలో చేరినా.. దానిని పెద్ద నేరంగా చూడాల్సిన అవసరం లేదని కూడా.. స్వయంగా చంద్రబాబు పార్టీ ప్రకటించిందంటూ.. వైసీపీ పోస్టు చేయడం గమనార్హం.
కాగా.. ఈ కోడి కత్తి వివాదం.. 2019. 2024 ఎన్నికల్లోనూ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అప్పట్లో వైసీపీ దీనిని అనుకూలంగా వాడుకుంటే.. తాజాగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో దీనిని కూటమి పార్టీలు తమకు అనుకూలంగా వాడుకున్నాయి. ఇక, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా.. మరోసారి వైసీపీ, టీడీపీలు కోడికత్తులు దూసుకున్నాయి.