వైరల్ టాపిక్... ఇవే కొడాలి నాని చివరి ఎన్నికలు!
అవును... గుడివాడ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 7 March 2024 3:49 PM GMTఎన్నికల్లో పోటీ చేసే విషయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వైసీపీ నేతల జాబితాలో తాజాగా కొడాలి నాని చేరారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఇప్పటికే మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇప్పటికే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవే తన చివరి ఎన్నికలు అంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... గుడివాడ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. గుడివాడకు మరో 500 - 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని.. తిరిగి అధికారంలోకి వచ్చాక తనకు మంత్రి పదవి కూడా అవసరం లేదని.. ఈ నిధులు సమకూర్తిస్తే చాలని.. ఆ పనులన్నీ పూర్తి చేసి రిటైర్మెంట్ తీసుకుంటానని కొడాలి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తెలిపారు. ఇప్పటికే తన వయసు 52 ఏళ్లు అని.. మరో ఐదేళ్ల తర్వాత రిటైర్మెంట్ వయసు వస్తాదని.. తర్వాత కొత్తవాళ్లకు అవకాశాలిస్తే వారు దిగుతారని అన్నారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇక తన కుమార్తెలకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిలేదని తెలిపిన కొడాలి నాని... ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అంతక ముందు... రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోని గోతిలో పాతిపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చిన కొడాలి నాని... సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ లను అభిమానించే ప్రతీ ఒక్కరూ.. చంద్రబాబు, ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో లోకేష్ ని గెలిపిస్తే... సీనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు గెంటేసినట్లు.. జూనియర్ ఎన్టీఆర్ ని గెంటేసి పార్టీని పూర్తిగా ఆక్రమించుకుంటాడని తెలిపారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలూ, కుతంత్రాలూ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ప్రధానంగా పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఎంతో చేస్తున్నారని తెలిపిన కొడాలి నాని... పేద ప్రజల కోసం జగన్ 120 సార్లు బటన్ నొక్కి రూ. 2.50 లక్షల కోట్లను అందించారని.. ఆయన కోసం ఈవీఎం లలో ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు.