వీడియో... మహిళా జర్నలిస్టుతో కొహ్లీ గొడవ!
ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు విరాట్ కొహ్లీ.
By: Tupaki Desk | 19 Dec 2024 10:26 AM GMTప్రస్తుతం టీమిండియా ఆసిస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 26 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో పాల్గొననుంది. ఈ మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా జరగనుండగా.. ఈ రోజు (డిసెంబర్ 19) టీమిండియా అక్కడకు చేరుకుంది. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు విరాట్ కొహ్లీ.
అవును... ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ రోజు అక్కడికి చేరుకుంది టీమిండియా. ఈ సమయంలో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ ను విమానాశ్రయంలో కొంతమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో భార్య అనుష్క శర్మ, పిల్లలు అకాయ్, వామికలతో కలిసి విరాట్ కొహ్లీ అటువైపు వచ్చాడు. ఈ క్రమంలో.. కొహ్లీ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది మీడియా. దీంతో... కొహ్లీ ఒక్కసారిగా కోప్పడిపోయాడు. ఈ సందర్భంగా ఫోటోలు ఎందుకు తీశారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు.
ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్ట్ వద్దకు వెళ్లిన కొహ్లీ.. ఫోటోలు, వీడియోలు చూపించాలని కోరాడు.. తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించాడు. అనంతరం అక్కడ నుంచి అసహనం, ఆగ్రహం కలగలిపిన మూడ్ లో ముందుకు కదిలినట్లు కనిపించాడు!
మళ్లీ ఒక నిమిషం ఆగిన కొహ్లీ... తన పిల్లల విషయంలో తనకు కొంత ప్రైవసీ కావాలని.. తనను అడగకుండా ఫోటోలు తీయొద్దని జర్నలిస్టులతో అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఆసిస్ మీడియాపై పలువురు నెటిజన్లు ఫైరవుతున్నారు.
కాగా... తన పిల్లల ప్రైవసీ విషయంలో విరాట్ కొహ్లీ చాలా జాగ్రత్తగా ఉంటాడనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లోనూ వారి ముఖాలపై ఎమోజీలు ఉంచి.. ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడతాడు! అలాంటిది నేరుగా వీడియోలు తీసేస్తుంటే.. కొహ్లీకి కోపం వచ్చేసింది!