జనసేనలోకి కోలగట్ల వారసురాలు ?
లేకపోతే 2019లో మొత్తం సీట్లను గెలుచుకుని జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన చోట ఇపుడు మా చెడ్డ రోజులు దాపురించాయని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2024 3:36 AM GMTఏమిటో వైసీపీకి రోజులు ఏ విధంగానూ కలసి రావడం లేదు అని అంటున్నారు. లేకపోతే 2019లో మొత్తం సీట్లను గెలుచుకుని జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన చోట ఇపుడు మా చెడ్డ రోజులు దాపురించాయని అంటున్నారు. పార్టీలో కీలకమైన వారే గడప దాటేస్తున్నారు. వారే పార్టీకి తలాఖ్ చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నేతగా ఉంటూ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయి శాసన సభ ఉప సభాపతిగా పనిచేసిన కోలగట్ల వీరభద్రస్వామి గత కొన్నాళ్ళుగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. పార్టీలో ఆయన ఉన్నారా లేరా అన్న చర్చ కూడా ఉంది.
ఇక ఆయన మంత్రి కోరిక అయితే తీరలేదు అన్న అసంతృప్తి ఉండనే ఉంది. వైసీపీ విపక్షంలోకి వచ్చింది. మరో అయిదేళ్ల పాటు ఖాళీగానే ఉండాలి. ఆ మీదట రాజకీయం చేయడానికి వయసు అడ్డు పడుతుంది. దానికి తోడు కోలగట్ల చేస్తున్న రాజకీయం అంతా తన కుమార్తె రాజకీయ వారసురాలు శ్రావణి కోసమే అని అంటున్నారు.
నిజానికి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయనగరం టికెట్ ని శ్రావణికి ఇవ్వమని కోరారని దానికి హై కమాండ్ నో చెప్పిందని టాక్ కూడా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కోలగట్ల పోటీ చేశారు. ఓటమిని చవి చూసారు. ఇపుడు రాజకీయం కూడా అయోమయంలో పడింది. అయితే తన కుమార్తెని ఏనాటికైనా ఎమ్మెల్యేగా చూడాలన్న తపనతో ఉన్న ఆయన అందుకోసం తగిన పార్టీ అన్వేషణలో ఉన్నారని తెలుస్తోంది. ఇక టీడీపీలో చూస్తే విజయనగరం టికెట్ ఎప్పటికీ పూసపాటి వారి ఫ్యామిలీకే కన్ ఫర్మ్ కాబట్టి జనసేన వైపుగా తన కుమార్తెని పంపుతున్నారు అని ఒక పెద్ద పుకారు లాంటి వార్త షికారు చేస్తోంది.
విజయంగరం కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ గా ఉన్న శ్రావణిని ఎమ్మెల్యేగా చేయాలని స్వామి కంకణం కట్టుకున్నారు. అయితే అది వైసీపీ ద్వారానే చేయవచ్చు కదా అని అనుకోవచ్చు. మరి వైసీపీలో ఉంటే టికెట్ రాదనో వచ్చినా గెలవలేదనో ఏదో డౌట్ ఉండబట్టే ఆయన పక్క పార్టీ వైపు కన్నెత్తి చూస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీలో ఉన్నపుడు పార్టీ అంతా తామే అయి సర్వం హవా చలాయించి చక్రం తిప్పిన తండ్రీ కుమార్తెలు ఇపుడు ఓటమి తరువాత ఫ్యాన్ నీడన ఉక్క బోతగా ఉందంటూ బయటకు రావాలనుకోవడం పట్ల చర్చ సాగుతోంది. కోలగట్ల ఆధిపత్య ధోరణికి విసిగి వేసారి జిల్లాలో ఎంతో మంది టీడీపీ జనసేన బాట పట్టారని కూడా అంటున్నారు.
అంతలా ఫ్రీ హ్యాండ్ వైసీపీ అధినాయకత్వం ఇచ్చినా కూడా సరైన టైం చూసి హ్యాండ్ ఇవ్వాలని కోలగట్ల ఫ్యామిలీ చూస్తోంది అన్నది అయితే గాసిప్ లా బయటకు వచ్చింది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ కోలగట్ల ఫ్యామిలీ అయితే వైసీపీలో యాక్టివ్ గా లేదు అనే అంటున్నారు. జనసేనలో టికెట్ హామీ తీసుకుని డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న కుమార్తెని చేర్చి తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని స్వామి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
రాజకీయాలు అంటే గాలివాటంగా మారిన నేపధ్యంలో విధేయతలకు అసలు తావు లేదు, ఇక ఏపీలో జనసేన కొత్త ఆల్టరేషన్ గా ఆవిర్భవిస్తోంది కాబట్టి ఆ పార్టీలోకి చాలా మంది వెళ్తున్నారు. దీంతో వైసీపీకి జనసేన రూపంలోనే అతి పెద్ద ముప్పు పొంచి ఉందని అంటున్నారు.