కొరకురాని కొలికపూడి!!
వివాదాస్పద తీరుతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీకి చికాకు తెప్పిస్తున్నాడు.
By: Tupaki Desk | 18 Dec 2024 10:30 AM GMTకూటమిలోని 164 మంది ఎమ్మెల్యేల్లో ఒకే ఒక్కరు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజధాని ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆ ఒక్క ఎమ్మెల్యే పేరు కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే...
వివాదాస్పద తీరుతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీకి చికాకు తెప్పిస్తున్నాడు. గెలిచిన తొలి రోజు నుంచే తన దుందుడుకు ప్రవర్తనతో టీడీపీ కార్యకర్తలకు మింగుడుపడని ఎమ్మెల్యే అధిష్టాన వర్గానికి కొరకరాని కొయ్యిగా మారుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజధాని ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి ఇంత తక్కువ సమయంలో వివాదాల్లో చిక్కుకోవడం, పదేపదే హైకమాండ్ నుంచి అక్షింతలు పడుతున్నా తన తీరు మార్చుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే తన నియోజకవర్గం పరిధిలోని ప్రతిపక్షానికి చెందిన ఓ గ్రామ స్థాయి నేత నిబంధనలు అతిక్రమించి భవనం నిర్మిస్తున్నారని, ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని తన అనుచరులతో దండెత్తిన ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలతో భేదాభిప్రాయాలు ముదిరి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకవైపు, మిగిలిన పార్టీ నేతలంతా మరో వైపు మొహరించడంతో తిరువూరు టీడీపీలో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ కలగజేసుకుని ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితిలో మార్పు తేవాలని ప్రయత్నించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో తిరువూరు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి కూడా తన తీరు మార్చుకుంటానని ప్రకటించి వివాదానికి ముగింపు పలికారు.
ఇలా కొద్ది రోజుల నుంచి తిరువూరు రాజకీయం సద్దుమణిగిందని భావిస్తున్న క్రమంలో తన తీరుతో మరోసారి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశారు ఎమ్మెల్యే కొలికపూడి. తన నియోజకవర్గం పరిధిలో మద్యం బెల్టు షాపులు పెడుతున్నారని ఆగ్రహించిన ఎమ్మెల్యే.. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారంటూ లైసెన్సు వైన్ షాపులకు తాళం వేయడంతో ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టైంది. నూతన మద్యం విధానం ప్రకటించి మద్యం ప్రియుల మన్ననలు అందుకుంటున్న ప్రభుత్వం.. బెల్టు షాపులు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏ ప్రభుత్వంలోనైనా బెల్టు షాపులు నిర్వహించడం అనేది పరిపాటిగా మారింది. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి కేసులు పెడుతున్నా, బెల్టుషాపులను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. పైగా అధికార పార్టీలకు చెందిన వ్యక్తులే గ్రామాల్లో బెల్టు దుకాణాలను పెడుతుంటారు. పైకి ప్రభుత్వం వద్దని చెప్పినా, క్షేత్ర స్థాయిలో వచ్చే ఒత్తిడి వల్ల ప్రభుత్వ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు.
బెల్టు షాపులనేది అందరికీ తెలిసిన తతంగమే అయినప్పటికి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తన నియోజకవర్గంలో మాత్రమే బెల్టు షాపులు ఉన్నాయనే విధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. వైన్ షాపులకు తాళాలు వేసిన ఎమ్మెల్యే ఫొటో సోషల్ మీడియాలో కనిపించగానే విపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో స్పందించింది. రాష్ట్రంలో అనధికార మద్యం దుకాణాలు నడుస్తున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేనే వెలుగులోకి తీసుకువచ్చారని, ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శలు గుప్పించింది. మరోవైపు ఎమ్మెల్యే తీరుతో లైసెన్సులు పొందిన మద్యం దుకాణాల యజమానులు గుర్రుగా ఉన్నారు. లాటరీ విధానంలో మద్యం దుకాణాలను కేటయించినా, ఎక్కువగా టీడీపీతోపాటు కూటమి పార్టీలకు చెందిన నేతలే ఎక్కువగా ఈ వ్యాపారంలో ఉన్నారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే తమను టార్గెట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుంది.