టీడీపీ వివాదాస్పద ఎమ్మెల్యే.. మళ్లీ వివాదంలో!
ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదు
By: Tupaki Desk | 1 Oct 2024 6:06 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికల్లో గెలిచీ గెలవగానే ఆయన తిరువూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఇంటిని జేసీబీలతో కూల్చివేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదమైంది.
కొద్ది రోజుల క్రితం టీడీపీకే చెందిన ఒక సర్పంచ్ ను బహిరంగంగా దూషించడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మీడియా ప్రతినిధులు సైతం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి మీడియా ప్రతినిధులతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అధికార గర్వానికి అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా చంద్రబాబుకు అందజేశారు. ఈ నేపథ్యంలో తనకు అన్నీ తెలుసని సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమ నేతగా కొలికిపూడి పాపులర్ అయ్యారు. ఎన్నికలకు ముందు వివిధ టీవీ చానెళ్ల చర్చల్లో ఆయన తరచూ కనిపించేవారు. అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన కొలికిపూడి వాస్తవానికి తాడికొండ అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే చంద్రబాబు ఆయనకు తిరువూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. ఈ నియోజకవర్గానికి కొలికపూడి స్థానికుడు కాకపోయినప్పటికీ కూటమి హవాలో గెలుపొందారు.
అయితే గెలుపొందినప్పటి నుంచి కొలికిపూడి ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. రెండు రోజుల క్రితం కూడా నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆయనను తమ నాయకుడిగా గుర్తించబోమని రోడ్డు ఎక్కి నినాదాలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీని కాపాడాలని నినాదాలు చేశారు.
తిరువూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి తవ్వకాలతో ఎమ్మెల్యే కొలికిపూడి భారీగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపైన వార్తలు రాసిన తమను బెదిరిస్తున్నారని మీడియా ప్రతినిధులు తాజాగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా సైతం కొలికిపూడి విషయంలో దూకుడుగానే వెళ్తోంది. అయినా కొలికిపూడి తగ్గడం లేదు.
తాజాగా సెప్టెంబర్ 29న ‘సేవ్ తిరువూరు’ పేరుతో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ర్యాలీకి నిర్ణయించారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ ర్యాలీకి ఆయన పిలుపునిచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఈ ర్యాలీని విరమించుకున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో ర్యాలీని విరమించుకున్నట్టు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు.
మళ్లీ ఇంతలోనే కొలికిపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళలు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేలలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. మహిళల పట్ల ఎమ్మెల్యే కొలికిపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంలో ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంటున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటివరకు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆమె భర్తపై పోలీసులు ఎప్పుడు కేసు పెట్టినా ఇలాంటి ఆత్మహత్య నాటకం ఆడుతారని ఎమ్మెల్యే ఆరోపించారు. తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని తెలిపారు.