ఉద్యమకారుడిగా ఓకే.. ఎమ్మెల్యేగా నాట్ ఓకే.. ఎవరీ కొలికిపూడి ఏంటీ ఆయన స్టోరీ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు.
By: Tupaki Desk | 8 Feb 2025 8:30 AM GMTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు. నిత్యం చుట్టుముడుతున్న వివాదాలతో ఆయన పేరు నిత్యం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. వాళ్లు.. వీళ్లు అని కాకుండా తన వారంటూ ఎవరూ లేకుండా చేసుకుంటున్న కొలికపూడి తీరుపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎవరీ కొలికిపూడి..? నిత్యం ఆయన చుట్టూ ఎందుకు వివాదాలు నెలకొంటున్నాయి? తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన నేపథ్యం ఏంటీ అని తెలుసుకుంటే? కొలికపూడి నేపథ్యం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. బాగా చదవుకుని మంచి ఉద్యోగం చేస్తూ రాజధాని కోసం ఉద్యమం చేసిన కొలికపూడి.. పొలిటీషన్గా ఫెయిల్ అవుతున్నాడని అంటున్నారు.
ఎమ్మెల్యేగా వివాదస్పదమవుతూ, ఫెయిల్డ్ పొలిటీషన్ గా ముద్రపడిన కొలికపూడి నిజానికి మంచి టాలెండెడ్ ప్రొఫెసర్. ఆయన దగ్గర శిక్షణ తీసుకుని గ్రూప్-1, సివిల్స్ పరీక్షలు రాసిన ఎందరో ప్రస్తుతం మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో డాక్టర్ కేఎస్ రావ్ ఐఏఎస్ అకాడిమీని స్థాపించి గత పాతికేళ్లుగా ఆ సంస్థను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు కొలికపూడి. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పొందిన కొలికపూడి కొన్నాళ్లు ఆంధ్రా యూనివర్శిటీలో లెక్చరర్ గా పనిచేశారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మేనేజింగ్ హెడ్గా వ్యవహరించారు. ఆ తర్వాతే తన పేరుతో డాక్టర్ కేఎస్ రావు (కొలికపూడి శ్రీనివాసరావు) ఐఏఎస్ అకాడమీ స్థాపించారు. 2001 నుంచి హైదరాబాద్ లో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢిల్లీలోని ఎన్నో ఇనిస్టిట్యూట్స్ ను కాదని చాలా మంది హైదరాబాద్ లో కేఎస్ రావు అకాడమీలో చేరుతున్నారు అంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తోంది. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ కేఎస్ రావు రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే అప్రతిష్ట మూటగట్టుకున్నారు.
నిజానికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం నాటకీయంగా జరిగింది. డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు సొంతవూరు రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్ లోనే స్థిరపడిన కొలికపూడి.. గత ప్రభుత్వ హయాంలో రాజధాని ఉద్యమంతో తెరపైకి వచ్చారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసమంటూ హైదరాబాద్ నుంచి ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆయన పోరాట పటిమ చూసి రాజధాని రైతులు కూడా ఆయనకు మద్దతు పలికారు. రాజధాని అమరావతి పరిరక్షణ సమితికి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కొన్నాళ్లకు సొంతంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో మరో ఉద్యమం చేశారు. ప్రస్తుతం దళిత పారిశ్రామిక రంగానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
రాజధాని ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేయడంతో కొలికపూడికి టీడీపీతో సంబంధాలు ఏర్పడ్డాయి. టీవీ డిబేట్లు, ఇతర వేదికల్లో రాజధాని వాయిస్ బలంగా వినిపించడంతో కొలికపూడి సేవలను వినియోగించుకోవాలని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఎన్నికల ముందు బాగా ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఆయన దూకుడు స్వభావాన్ని టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యమ సమయంలోనే టీవీ డిబేట్ లో బీజేపీ నేతపై చెప్పు విసరడం, రామ్ గోపాల్ వర్మ తల తెచ్చినోడికి కోటి ఇస్తానని ప్రకటించడం అప్పట్లో తీవ్ర వివాదమయ్యాయి. అయితే అవి ఆయనలో ఉన్న ఉద్యమ ఆవేశంగానే పరిగణించారు కానీ, స్వతహాగా కొలికపూడి ఆవేశపరుడిగా గుర్తించలేకపోయారని అంటున్నారు.
ఇలా రాజధాని ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొలికపూడి తన సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడ అప్పటికే టీడీపీకి సీనియర్ నేత శ్రవణ్ కుమార్ ఉండటంతో కొలికపూడిని తిరువూరు టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు 20 రోజుల ముందే తిరువూరులో అడుగుపెట్టిన కొలికపూడి 20 ఏళ్లుగా టీడీపీ గెలవని చోట ఆ పార్టీకి విజయం అందించి రికార్డు సృష్టించారు. అయితే గెలిచిన మరునాడు నుంచి ఆయన ప్రతాపం చూపడం మొదలుపెట్టారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన ఎంపీపీ భవనాన్ని దౌర్జన్యం కూల్చేయాలని ప్రయత్నించడం నుంచి సొంత పార్టీ కార్యకర్తలకు వేధింపులు, మీడియాతో గొడవ, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు కొలికపూడి. మొత్తానికి ఆయన ఓ సక్సెస్ ఫుల్ ప్రొఫెసర్ నుంచి ఫెయిల్డ్ పొలిటీషియన్ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారని అంటున్నారు.