కొలికిపూడి రివర్స్ అటాక్ : రాజీనామా చేస్తానంటూ బెదిరింపు
తన డిమాండును నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
By: Tupaki Desk | 27 March 2025 11:07 AM135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యంత వివాదాస్పద నేతగా ముద్రపడిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదాన్ని రాజేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి అందరికీ టార్గెట్ అయిన ఎమ్మెల్యే ఈ సారి తానే టార్గెట్ ఫిక్స్ చేశారు. తన సహచరులో.. ఉద్యోగులనో టార్గెట్ చేస్తే కిక్కు ఏముంటుందని భావించారేమో ఏకంగా అధిష్టానంపైనే గురిపెట్టారు. తన డిమాండును నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో తిరువూరు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారుతోంది.
ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజు నుంచే వివాదాలతో సహవాసం చేస్తున్న తిరువూరు శాసనసభ్యుడు కొలికిపూడి గత నెలరోజులుగా కాస్త విరామమిచ్చారు. వరుస వివాదాలతో తలనొప్పిగా మారిన కొలికపూడిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టిన తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా కొలికపూడి జూలు విదిల్చారు. తన మాట నెగ్గాలని పంతం పడుతున్న ఎమ్మెల్యే కేఎస్ఆర్ తిరువూరుకి చెందిన సీనియర్ టీడీపీ నేత రమేశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఆల్టిమేటం జారీ చేస్తున్నారు. రమేశ్ రెడ్డిపై తాను ఫిర్యాదుచేసి పది రోజులు అవుతున్నా పట్టించుకోలేదని, 48 గంటల్లో రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని ప్రకటించి కాక రాజేశారు ఎమ్మెల్యే.
ఓ గిరిజన మహిళతో టీడీపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది స్థానికంగా సంచలనంగా మారడంతో పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు బాధితురాలికి బాసటగా తిరువూరులో పలువురు గిరిజన మహిళలు ఆందోళన చేశారు. ఈ విషయంలో బాధితురాలి పక్షాన నిలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు టీడీపీ నేత రమేశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు. పది రోజుల క్రితమే రమేశ్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ ద్రుష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం చేయకలేకపోతే ఎమ్మెల్యే పదవి దండగ అని భావిస్తున్న కొలికపూడి అధిష్టానానికి 48 గంటల గడువు విధించారు. లేకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు.
ఎప్పుడూ అధిష్టానం నుంచి అక్షింతలు వేయించుకునే కొలికపూడి రివర్స్ లో పార్టీ అధిష్ఠానంపై అటాక్ చేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా తన నియోజకవర్గంలో బెల్టు షాపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ కొలికపూడి బ్రాందీ షాపుల వద్దకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వంలో ఉండగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు కూడా తనపై వచ్చిన ఆరోపణలను లెక్కచేయని కొలికపూడి ఓ టీడీపీ నేతను పార్టీ నుంచి బయటకు పంపాలనే లక్ష్యంతో అధిష్టానంపై ఒత్తిడి తేవడం ఉత్కంఠకు దారితీస్తోంది.