Begin typing your search above and press return to search.

బంగ్లాదేశీయులకు ఆసుపత్రుల్లో వైద్యానికి నో!

బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై ఈ మధ్యన దాడులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2024 7:30 AM GMT
బంగ్లాదేశీయులకు ఆసుపత్రుల్లో వైద్యానికి నో!
X

అక్కడెక్కడో జరిగిన పరిణామాలపై స్పందించే కొందరు.. మన పొరుగున ఉండే బంగ్లాదేశ్ లో లక్షలాది హిందువులకు చుక్కలు చూపిస్తున్న బంగ్లాదేశ్ అతివాద ప్రభుత్వ తీరుపై నోరు విప్పని వైనం షాకింగ్ గా మారింది.అక్కడెక్కడో పాలస్తీనాలో జరిగే అంశాలపైనా.. ఇంకెక్కడో జరిగే అంతర్జాతీయ అంశాల మీద స్పందించే భారత్ లోని పలువురు.. బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న దారుణాలపై ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై ఈ మధ్యన దాడులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ.. మోడీ సర్కారు మాత్రుం ఈ అంశంపై స్పందించాల్సిన తీరులో స్పందించట్లేదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు.. బంగ్లాదేశ్ లో హిందువులపైనా.. హిందూ సంస్థలకు చెందిన వారిపై వేధింపులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బంగ్లాదేశ్ లోని హిందూ మత పెద్ద చిన్మయ్ క్రిష్ణ దాస్ పై దేశ ద్రోహం నేరాన్ని మోపటమే కాదు జైల్లో ఉంచిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ఆయన శిష్యులు ఇద్దరిని అరెస్టు చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే. ఇంతకూ వారు చేసిన నేరం ఏమిటన్న విషయంలోకి వెళితే.. జైల్లో ఉన్న చిన్మయ్ క్రిష్ణదాస్ కు ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన.. ఈ ఇద్దరు శిష్యులను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. మరోవైపు ఇస్కాన్ ఆఫీసు మీదా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ఈ అంశంపై కోల్ కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ వెల్లడించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అరెస్టు చేశారని.. మరోవైపు ఢాకాలోని భైరబ్ లో ఉన్న ఇస్కాన్ ఆఫీసుపై దుండగులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్ లను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. మోడీ సర్కారు నుంచి బలమైన ప్రకటన ఏమీ రావట్లేదన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వాసులకు తమ ఆసుపత్రుల్లో తాము వైద్యం చేయమంటూ కోల్ కతాలోని జేఎన్ రే ఆసుపత్రితో పాటు త్రిపుర రాజధాని అగర్తలాలో ఉండే ఐఎల్ఎస్ ఆసుపత్రి ప్రకటన చేశాయి. బంగ్లాదేశ్ హిందువులపై దాడులతో పాటు.. భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు సంబంధించి తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించారు. రెండు ఆసుపత్రుల యాజమాన్యమే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు.. ప్రభుత్వ పరంగా మోడీ సర్కారు మరింతలా స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు.మరి.. ప్రధాని మోడీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.