Begin typing your search above and press return to search.

ఉరి కాదు యావజ్జీవమే.. కోర్టు తీర్పుపై మంటలు.. ఎందుకలా?

అందరూ అంచనా వేసుకున్నట్లుగా ఉరి కాకుండా యావజ్జీవన కారాగారం విధించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 4:41 AM GMT
ఉరి కాదు యావజ్జీవమే.. కోర్టు తీర్పుపై మంటలు.. ఎందుకలా?
X

కోల్ కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటం.. ఆందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే. నిందితుడికి మరో మాటకు అవకాశం లేకుండా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అందుకు భిన్నంగా నిందితుడ్ని దోషిగా తేల్చేసిన న్యాయస్థానం ఉరిశిక్ష వేయకుండా యావజ్జీవంతో సరి పెట్టిన వైనంపై పెదవి విరుస్తున్నారు.

ఆగస్టు తొమ్మిదిన కోల్ కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర వైద్యురాలిపై అత్యంత పాశివికంగా హత్యాచారం జరిగింది. ఆసుపత్రిలో వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ కు భారతీయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్తుడంటూ కోర్టు ప్రకటించింది. అందరూ అంచనా వేసుకున్నట్లుగా ఉరి కాకుండా యావజ్జీవన కారాగారం విధించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో ఉరి కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే విధిస్తున్నటల్ుగా సియాల్డాలోని అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పలువురు తప్పు పడుతున్నారు. బెంగాల్ లోని అధికార మమతా సర్కారుతో పాటు సీబీఐ కూడా ఉరిశిక్ష విధించాలని వాదించినా.. అంతిమంగా యావజ్జీవమే పడటంపై కొత్త రచ్చ మొదలైంది. కోర్టు తీర్పుపై పలు వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే సోషల్ మీడియాలో నిర్మోహమాటంగా పోస్టులు పెడుతున్నారు. తీర్పు వెలువరించే వేళలో కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీశాయి.

ఉరి విధించేంత హేతుబద్ధత ఈ కేసులో లేదని కోర్టు వ్యాఖ్యానించింది. హత్యాచారానికి గురైన ఆడకూతురు.. ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తనకు బాగా అర్థమవుతుందని దోషిగా నిరూపితుడైన సంజయ్ తల్లి వ్యాఖ్యానించారు. కన్నకొడుకే అయినప్పటికి నేరం రుజువైతే త శిక్ష పడాల్సిందేనంటూ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగాలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ఆగస్టు తొమ్మిది తర్వాత బెంగాల్ లో ఐదు హత్యాచార ఘటనల్లో మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు పోక్సో కోర్టులు ఏకంగా ఉరి విధించాయి. అలాంటిది ఈ కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష మాత్రమే పడటం గమనార్హం. అయితే.. ఈ కేసు విచారణ పూర్తి చేసుకొని.. తీర్పు ఇచ్చే వేళలో న్యాయమూర్తి ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఈ ఘటన ఉరిశిక్ష విధించేంత అరుదైన కేసు ఏమీ కాదని పేర్కొంది. అయితే..ఈ తీర్పుపై వెలువడుతున్న ఆందోళనల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పుపై తాము సంత్రప్తికరంగా లేమన్న ఆమె.. అప్పీలుకు వెళతామన్నారు.

అయితే.. తీర్పు పాఠం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కోర్టు ఈ తరహా శిక్ష విధించటానికి దారి తీసిన కారణాలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.అయితే.. జరిగిన దారుణాన్ని బలంగా చెప్పే ప్రయత్నంలో ఫెయిల్ కావటం.. సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదన్న అంశాల్ని ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేకపోయినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది కూడా శిక్ష విషయంలో దోషికి కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు. ఈ ఘటన బయటకు వచ్చినప్పటి నుంచి పోలీసుల తీరుపై విమర్శలు రావటం తెలిసిందే. అనంతరం విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లినా.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పును చూసినప్పుడు కొత్త సందేహాలకు కారణమవుతోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ప్రిన్సిపల్ ను సీబీఐ అరెస్టు చేసినా.. నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవటం లాంటివి విచారణ నికార్సుగా జరిగిందా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు కోర్టు ఇచ్చిన తీర్పు అందరికి ఆమోదయోగ్యంగా లేదన్నది నిర్విదాంశం. మరి..ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీలుకు వెళుతున్న వేళ.. ఉన్నత న్యాయస్థానం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.