వైద్యురాలిపై అత్యాచారంలో కీలక పరిణామం!
అయితే కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తుండటంతో కోల్ కతా హైకోర్టు వైద్యురాలి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది.
By: Tupaki Desk | 6 Sep 2024 8:39 AM GMTకోల్ కతా వైద్యురాలి హత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో పీజీ మెడిసిన్ సెకండియర్ చదువుతున్న జూనియర్ డాక్టర్.. ఆగస్టు 8న ఆస్పత్రి ప్రాంగణంలో హత్యాచారానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కాగా వైద్యురాలి హత్యాచార కేసును మొదట కోల్ కతా పోలీసులు దర్యాప్తు చే శారు. అయితే కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తుండటంతో కోల్ కతా హైకోర్టు వైద్యురాలి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ వైద్యురాలి హత్యాచారం ఘటనలో దర్యాప్తును వేగవంతం చేసింది. వైద్యురాలిది గ్యాంగ్ రేప్ కాదని.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారం చేశాడని సీబీఐ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ జరిగినట్టు ఆనవాళ్లు లేవని చెప్పినట్టు సమాచారం.
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన ట్టు సీబీఐ తేల్చినట్టు తెలుస్తోంది. దీంతో సీబీఐ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్టేనని సమాచారం. ఈ మేరకు త్వరలో కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయనుందని చెబుతున్నారు.
కోల్ కతా పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదని, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం నుంచి పోస్టుమార్టం ప్రక్రియ వరకు అంతా ఆలస్యం జరిగిందని కోల్ కతా హైకోర్టు పోలీసులపై మండిపడింది. అంతేకాకుండా ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు సైతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.
ఈ నేపథ్యంలో తన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రేగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం మార్చిన సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తు త్వరగా చేయడం లేదంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. అత్యాచారం జరిగిన ఆర్జీకార్ మెడికల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సందీప్ ఘోష్.. మమతకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. అతడిపైన తీవ్ర విమర్శలు వచ్చినా కేవలం మమత బదిలీతో సరిపెట్టారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ సందీప్ ఘోష్ పైన కేసు నమోదు చేశాయి. ఆస్పత్రిలో, అతడి ఇంటిలో తనిఖీలు చేపట్టాయి.
సీబీఐకి అప్పగించినా కేసు దర్యాప్తు తేలడం లేదని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగడం లేదన్నారు.
ఈ నేపథ్యంలో సీబీఐ స్పందించినట్టు సమాచారం. వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. ఒక్కరే హత్యాచారం చేసినట్టు పేర్కొన్నట్టు సమాచారం.