పెనమలూరు టీడీపీలో కేపీ చిచ్చు...!
వైసీపీలో టికెట్ల కసరత్తు కాస్తా ఇపుడు ఆ పార్టీ నేతలు కొందరు వేరే పార్టీలలో దారి చూసుకునేలా చేసింది
By: Tupaki Desk | 13 Jan 2024 12:30 AM GMTవైసీపీలో టికెట్ల కసరత్తు కాస్తా ఇపుడు ఆ పార్టీ నేతలు కొందరు వేరే పార్టీలలో దారి చూసుకునేలా చేసింది. అలా చూసుకుంటే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కె పార్ధసారధికి ఈసారి పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వమని వైసీపీ చెప్పేసింది దాంతో ఆయన అలిగి పార్టీని వీడేందుకు డిసైడ్ అయ్యారు.
ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని చూస్తున్నారు. దాంతో ఆయన వరకూ టికెట్ సమస్య తీరుతుందేమో కానీ అక్కడ గత అయిదేళ్లుగా పనిచేసుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం మాత్రం పార్ధసారధి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్ధ సారధిని ఎంట్రీని వారు సహించడంలేదు.
తాము అయిదేళ్లుగా ఆయన మీదనే పోరాటం చేశామని ఇపుడు ఆయన వచ్చి చేరడమే కాకుండా బోడే ప్రసాద్ టికెట్ కి ఎసరు పెడితే తాము సహించేది లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే పార్ధసారధి సీనియర్ మోస్ట్ నేత. ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టైం లో నెగ్గారు.
ఆయనకు వైఎస్సార్ టైం లో మంత్రి పదవి దక్కింది. ఇక ఆయన వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్ గా ఆనాడే ఆయన మంత్రి పదవి కోరుకున్నారు. కానీ దక్కకపోవడంతో నాటి నుంచే అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. మొత్తానికి జగన్ ఆయనకు టికెట్ లేదని తేల్చడంతో తన దారి తాను చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు
ఈ పరిణామాలు వైసీపీలో జరిగితే ఇపుడు టీడీపీలో టికెట్ ఖాయం అని తానే ఎమ్మెల్యే అవుతాను అని ఆశగా ఎదురుచూస్తున్న బోడె ప్రసాద్ కి పార్ధసారధి రూపంలో షాక్ తగింది అని అంటున్నారు. ఆయనకు నచ్చ చెప్పడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలెట్టింది. టీడీపీ సీనియర్ నేత గద్దె రామమోహన్ బోడె ప్రసాద్ వద్దకు వెళ్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం సాగింది.
అయితే ఎవరు ఏమి చెప్పినా వెనక్కు తగ్గేది లేదని బోడె ప్రసాద్ వర్గం అంటోంది. ఈ పరిణామాల మీద ప్రసాద్ అయితే చంద్రబాబు ఏ హామీ పార్ధసారధికి ఇవ్వలేదని తన అనుచరులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరితే చేరవచ్చు కానీ టికెట్ ఇవ్వకూడదు అన్నది బోడె వర్గం మాటగా ఉంది.
ఒకవేళ పార్ధసారధికే కనుక టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా పెనమలూరు టీడీపీలో చిచ్చు రగులుతుందని అంటున్నారు. అపుడు బోడె వర్గం కూడా సీరియస్ గానే డెసిషన్ తీసుకుంటుంది అని అంటున్నారు. ఇక ఈ పరిణామాలను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది అని అంటున్నారు.
ఇక బోడె ప్రసాద్ విషయానికి వస్తే 2014లో పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్ పై 31448 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అప్పట్లో అధి భారీ మె మెజారిటీ కింద లెక్క. అయితే ఆయన 2019లో పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో 11317 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఇక బోడె ప్రసాద్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ గా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆశలు అన్నీ పెనమలూరు మీదనే ఉన్నాయి. ఇపుడు అధినాయకత్వం ఎలా నచ్చ చెబుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.