Begin typing your search above and press return to search.

"ఐకాన్ స్టార్ అయితే ఏంటి?"... కొనసాగుతున్న కోమటిరెడ్డి ఫైర్!

ఈ నేపథ్యంలోనే... ఒక ప్రాణం పోయిన తర్వాత ఐకాన్ స్టార్ అయితే ఏమిటి.. సూపర్ స్టార్ అయితే ఏమిటి అంటూ విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి.

By:  Tupaki Desk   |   23 Dec 2024 6:46 AM GMT
ఐకాన్  స్టార్  అయితే ఏంటి?... కొనసాగుతున్న కోమటిరెడ్డి ఫైర్!
X

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శనివారం అసెంబ్లీలో ఈ విషయాన్ని అక్బరుద్దీన్ లేవనెత్తడం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం.. అనంతరం అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి.. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అనడం తెలిసిందే.

దీంతో ఒక్కసారిగా వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద ఏమి జరిగింది.. ఎలా జరిగింది.. అల్లు అర్జున్ వ్యవహార శైలిపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది సంచలనంగా మారింది. మరోపక్క.. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ ను వెంటాడుతున్నారు కోమటిరెడ్డి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం వ్యాఖ్యానించిన తర్వాత వాటిని ఖండిస్తున్నట్లుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించారనే చర్చ నేపథ్యంలో... సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదని అన్నారు.

అసలు ఆ రోజు ఏమి జరిగిందనే విషయాన్ని సభలో వివరించారని.. అయితే ఆ వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే... ఒక ప్రాణం పోయిన తర్వాత ఐకాన్ స్టార్ అయితే ఏమిటి.. సూపర్ స్టార్ అయితే ఏమిటి అంటూ విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి.

ఇదే సమయంలో.. ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా... సంధ్య థియేటర్ వద్ద పోలీసులతో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని.. ఈ ఘటన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టం ముందు అంతా సమానమేనని.. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవని.. తప్పు చేస్తే నటుడికైనా, ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదని.. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే కేటీఆర్, హరీష్ రావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారికి మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లుందని కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు.

రూ.20 కోట్లు చెల్లించాలి!:

ఈ ఘటనకు సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో మొదటి నుంచీ సీరియస్ గా స్పందిస్తున్నట్లు కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా ఓ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ తప్పనిసరిగా రూ.20 కోట్లు చెల్లించాలని అన్నారు.

ఈ సందర్భంగా స్పందిస్తూ... తమ సినిమా 2000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు వసులు చేసిందని గర్వంగా చెప్పుకుంటున్నారని.. అలాంటప్పుడూ చనిపోయిన వారి కుటుంబానికి రూ.20 కోట్లు ఎందుకు చెల్లించలేరని ప్రశ్నించిన మంత్రి... అల్లు అర్జు, చిత్ర నిర్మాతలు ఆ కుటుంబానికి రూ.20 కోట్లు చెలించాలనేది తన డిమాండ్ అని స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తూ...!:

అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిపై రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించారు.

ఇందులో భాగంగా... ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. సంధ్య థియేటర్ ఘటన అంశం కోర్టులో ఉందని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.