కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి
అందుకే అంటారు గెలుపులో తప్పులు కాస్తా ఒప్పులు అవుతాయి. కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తిప్పలు మొదలవుతాయి.
By: Tupaki Desk | 29 Dec 2024 4:12 PM GMTఅందుకే అంటారు గెలుపులో తప్పులు కాస్తా ఒప్పులు అవుతాయి. కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తిప్పలు మొదలవుతాయి. అప్పటివరకు జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అప్పటివరకు తమకు తిరుగేలేదన్నట్లుగా ఉన్న వారికి తిప్పలు మొదలవుతాయి. పదేళ్లు నాన్ స్టాప్ గా తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ ఫ్యామిలీకి రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఏదో ఒకరకంగా షాకులు తగులుతున్నాయి.
ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కుమార్తె కవిత జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. ఇంకోవైపు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీకి తోడుగా ఈడీ సైతం రంగంలోకి దిగటం.. కేటీఆర్ అరెస్టు ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వేళలో.. కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొన్న ఓఆర్ఆర్ లీజు అంశాన్ని రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకున్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లీజు అంశంపై విచారణ జరుగుతోందంటూ కొత్త బాంబు పేల్చారు. దీంతో.. కేసీఆర్ ఫ్యామిలీకి మరో కష్టం ఎదురుకానున్నట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మాజీ మంత్రి హరీశ్ రావు తన మామ.. బామ్మర్దిని ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై సిట్ వేయాలని అడిగారు. హరీశ్ రావు అసెంబ్లీలో కోరడంతోనే ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో దొంగలు దొరికారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు కూడా బయటపడతాయి’’ అంటూ పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇక.. ఆర్ఆర్ఆర్ కోసం ఢిల్లీలో ఉండి తానెంతో క్రషి చేశానన్న కోమటిరెడ్డి.. 2017లో ఆగిన ప్రాజెక్టు తమ ప్రయత్నాలతోనే ముందడుగు పడినట్లుగా పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధానమంత్రి మోడీకి థ్యాంక్స్ చెప్పిన కోమటిరెడ్డి.. ఈ ప్రాజెక్టుకు సహకరించిన కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి చతురత ఏమంటే.. ఒకే ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూనే.. తమ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి సాధించిన విజయాన్ని షేర్ చేయటం.