మంత్రితో సినిమాలు మాన్పించిన 'పుష్ప'..!
అనంతరం.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
By: Tupaki Desk | 22 Dec 2024 3:51 AM GMTసంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలపై శనివారం తెలంగాణ అసెంబ్లీలోనూ, బయట సంచలన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏమి జరిగిందో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కొరగా.. అందుకు రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.
అనంతరం.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... తెలంగాణలో సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ కుటుంబానికి పరిహారం ఇస్తామన్న సినీనటుడు.. ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
అయితే... థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామని ప్రకటించారు. అనంతరం శనివారం సాయంత్రం హాస్పటల్ లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా బాలుడు కోలుకోవడానికి ప్రబ్భుత్వం ఎంతైనా ఖర్చుపెడుతుందని భరోసా ఇచ్చారు.
ఇదే సమయంలో... అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి అయినా బతికించాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలోనే... తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ తరుపున శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు రూ.25 లక్షల మొత్తంతో కూడిన చెక్ ను అందజేశారు. త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం శ్రీతేజ్ కు ట్యూబ్స్ ద్వారా ద్రవాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పిన మంత్రి.. బాలుడి వైద్య ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పునరుద్ఘాటించారు. శ్రీతేజ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ల రేట్లు పెంపు విషయంపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
అవును... 'పుష్ప-2' ఘటన ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టిగానే పడినట్లుంది. సంధ్య థియేటర్ ఘటన అనంతరం తెలంగాణ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా... టిక్కెట్ల రేటు పెంపు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తెలిపారు.
స్వాతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమం, సందేశంతో కూడినవైతే ఆలోచిస్తామని.. అది కూడా నామినల్ గానే పెంచుతామని.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని.. ఇదంతా "పూష్ప-2"తోనే స్టాప్ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... 'పుష్ప-2' సినిమా చూశానని.. ఇకపై సినిమాలు చూడదలచుకోలేదని అన్నారు.
ఏది ఏమైనా... సంధ్య థియేటర్ ఘటన వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఎంత సీరియస్ గా ఉందనేది అసెంబ్లీలో రేవంత్, కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు!