కవిత తప్పు చేయలేదా? బీఆర్ఎస్ ఖేల్ ఖతం!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.
By: Tupaki Desk | 23 May 2024 12:30 PM GMTతెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు పొద్దున లేచినప్పటి నుంచి అదేపనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా సన్నపు వడ్లకు మాత్రమే బోనస్ రూ.500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో బీఆర్ఎస్‌కు ఆయుధం దొరికినట్లయింది. ఈ విషయంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి కౌంటర్‌గా ఇతర కాంగ్రెస్ మంత్రులు కూడా నోరు విప్పుతున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ఇది చాలదన్నట్లు ఢిల్లీ వెళ్లి మరీ స్కామ్‌లు చేశారన్నారు. ఎలాంటి అవినీతి చేయకుంటే కవితపై ఎనిమిది పేజీల ఛార్జీషీట్ ఎందుకు దాఖలు చేశారని మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కూడా ఎంటరైంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. జూన్ తర్వాత బీఆర్ఎస్ మూతపడటం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీని క్లోజ్ చేయడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. జూన్ 5 తర్వాత ఆ పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ నేతల వెంటపడి మరీ కొడతారని కోమటిరెడ్డి తెలిపారు.