Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను అంత మాట అనేశాడేంటి?

తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డా ఈ వేడి తగ్గలేదు.

By:  Tupaki Desk   |   26 July 2024 8:29 AM GMT
కేసీఆర్‌ ను అంత మాట అనేశాడేంటి?
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్షం నామమాత్రంగానే మిగిలిపోవడం, వైసీపీకి ఉన్న 11 మంది శాసనసభకు కూడా రాకపోవడంతో శాసనసభ సమావేశాల్లో రంజు లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా హాజరవుతుండటంతో వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య తీవ్ర విమర్శలు, వాగ్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డా ఈ వేడి తగ్గలేదు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ స్థానంలో తాను ఉంటే రాజకీయాల నుంచి తప్పుకునేవాడినని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని కోమటిరెడ్డి నిలదీశారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీలు కట్టవలసి వస్తోందని మండిపడ్డారు.

గత 30 ఏళ్లలో ప్రస్తుత బడ్జెట్‌ అత్యుత్తమమైనదిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేంద్రం సహకరించకున్నా.. అత్యుత్తమ బడ్జెట్‌ ను తీసుకొచ్చామన్నారు. గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్‌ ను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ బడ్జెట్‌ లో వ్యవసాయానికి పెద్దపీట వేశామని తెలిపారు. ఇన్నాళ్లూ వివక్షకు గురయిన దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ రైతు కూలీలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ) తరహాలో తెలంగాణ ప్రజలకు స్కిల్‌ యూనివర్సిటీని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

కాగా బీజేపీలో విలీనం కావడానికి బీఆర్‌ఎస్‌ ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాంబుపేల్చారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని చెప్పారు. వంద శాతం బీఆర్‌ఎస్‌.. బీజేపీలో విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ స్థానంలో తానుంటే రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేవాyì నని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కేంద్రంలో బీజేపీది కుర్చీ బచావో ప్రభుత్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. నీతి అయోగ్‌ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాలు బహిష్కరిస్తాయని స్పష్టం చేశారు.