ఏపీకి ప్రత్యేక హోదా... మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎంపికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
By: Tupaki Desk | 12 Dec 2023 6:57 AM GMTతెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎంపికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం, ఆ మేరకు కేంద్రంలోని నాటి పెద్దలు ఇచ్చిన హామీ మొదలైన విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
ఇదే క్రమంలో... రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేసిన ఆయన... ఇప్పటికీ విభజన చట్టం అమలుపరచకపోవడం బాధాకరమని అన్నారు. దాని అమలుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. హోదాపై ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో చెప్పగా.. దాన్ని అమలుపరిచే బాధ్యత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా తెలంగాణ భవన్ ను పరిశీలించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో వీలైనంత త్వరగా కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తామని అన్నారు. ఏపీ భవన్ విభజనలో ఎలాంటి వివాదం లేదని.. గత ప్రభుత్వ విధానానికి భిన్నమైన వైఖరిని తాము తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్.ఆర్.ఆర్.) తెలంగాణకు మరొక మణిహారమని.. దీనితో సహా పలు జాతీయ రహదారుల అంశాలపై మాట్లాడేందుకు నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ ను కలుస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... మరో రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలంగాణ ఆర్ & బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు!
కాగా గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ తిరుమలకు వెళ్లిన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రత్యేకహోదాపై ఇవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో విభజన హామీల్లో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.