హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతు బీఆర్‌ఎస్ కే: రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
కొద్ది రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 27 Oct 2023 6:57 AM GMTకొద్ది రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. ఇందుకోసమే తాను బీజేపీలో చేరానన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినా కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరానని రాజగోపాలరెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ పై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతోనే బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీలో తనకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అయితే తన లక్ష్యం మాత్రం నెరవేరలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ కే మద్దతు ఇస్తారని రాజగోపాలరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాబట్టి బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్ కి ఓటు వేసినట్లేనన్నారు.
ప్రజలు తనను కాంగ్రెస్ లోకి రావాలని కోరుకున్నారని రాజగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ ధన మదం, అధికార మదంతో మాట్లాడుతున్నారని రాజగోపాలరెడ్డి మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలనే కోరికతో ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ కేసీఆర్ ఆఫర్ కూడా ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. అఖిల భారత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజగోపాలరెడ్డి న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సైతం ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.