కేసీఆర్ మీద ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అవసరమా రాజగోపాల్?
ఈ విషయాల్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి మర్చిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది
By: Tupaki Desk | 13 July 2024 1:30 PM GMT‘చేతి’కి అధికారం వచ్చిందే ప్రత్యర్థి అహంకారపూరిత వ్యవహారశైలితోనే అన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ లోని అత్యదికులు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ప్రజలు ఒప్పుకుంటారు. దేన్నైనా భరిస్తాం కానీ అహంకారాన్ని వదిలేది లేదన్నట్లుగా తెలంగాణ ప్రజల తీరు ఉంటుందన్న విషయం తెలిసిందే. మంచి.. చెడు అన్నది పక్కన పెడితే అధికారంలో చేతిలో ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరుకు తెలంగాణ ప్రజలు ప్రధమ శత్రువులు. వారెంతటి వారైనా పట్టించుకోరు. అహంకారానికి..అత్యాశలకు లాగి పెట్టి కొట్టినట్లుగా బదులివ్వటం తెలిసిందే.
ఈ విషయాల్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి మర్చిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రజలు తమ చేతికి ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా వినియోగిస్తూ.. వారు కోరుకున్న పాలనను ఇవ్వాలే తప్పించి.. ప్రతీకార రాజకీయాల్ని చేస్తామంటే ఎవరూ ఊరుకోరు. ఈ చిన్న విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ఎందుకు మర్చిపోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా వేగంగా అడుగులు పడుతున్న వేళలో.. కేసీఆర్ మీద సానుభూతి పెరిగేలా.. కాంగ్రెస్ సర్కారుపై కోపం కలగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు.
గులాబీ అధినేత కేసీఆర్ ను గద్దె దించాలన్న తన లక్ష్యం నెరవేరిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడిన ఆయన్ను జైలుకు పంపడమే తన తర్వాతి లక్ష్యమని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి అనూహ్య ఓటమి ఎదురుకావటం.. ఈ ఓటమికి కేసీఆర్ కారణమన్న దానిపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా రగిలిపోవటం తెలిసిందే. వ్యక్తిగతంగా కోపతాపాలు మామూలే. అలా అని సాదాసీదా వ్యక్తుల మాదిరి కీలకస్థానాల్లో ఉన్న వారు మాట్లాడకూడదన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.
తాను ఎజెండాగా పెట్టుకున్న విషయాల్ని బయటకు చెప్పటం ద్వారా అది.. ప్రభుత్వ ఎజెండాగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేనా.. రేపొద్దున నిజంగానే కేసీఆర్ ను అరెస్టు చేసినా.. అదంతా పగ తీర్చుకోవాటానికి జరిగిన ప్రక్రియ తప్పించి..నిజంగానే తప్పు చేసిన కారణంగా అరెస్టు అయ్యారని ప్రజలు అనుకోని పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ ను నిజంగానే జైలుకు పంపే ఉద్దేశమే రాజగోపాల్ రెడ్డికి ఉంటే.. అందుకు ముందుగా ఆయన ప్రభుత్వంలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాలు.. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవకతవకల్ని బయటపెట్టాలి. విలువైన ప్రజాధనం వేస్టు అయ్యిందన్న భావన తెలంగాణ ప్రజలకు కలగాలి. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అనుకోవటంతో పాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన ప్రజల్లో బలంగా కలగాలి. అప్పుడు మాత్రమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యం నెరవేరుతుంది.
అవన్నీ వదిలేసి.. కేసీఆర్ జైలుకు వెళ్లాలన్న సింగిల్ మాటను అదే పనిగా చెప్పేయటం ద్వారా మరింత నష్టం వాటిల్లుతుందన్నది మర్చిపోకూడదు. రాజకీయాల్లో కోపతాపాలు.. తీవ్ర మైన భావోద్వేగాలు మామూలే. అలా అని వాటినే పట్టుకొని ప్రతీకార రాజకీయాల దిశగా అడుగులు వేయకూడదు. అదే జరిగితే.. ఈ రోజున్న అధికారం రేపొద్దున చేజారిపోవటం ఖాయమన్నది రాజగోపాల్ గ్రహించాలి. ప్రజలు తమకు ఇచ్చిన అధికారం వ్యక్తిగత పగ తీర్చుకోవటానికి కాదు.. పాలనతో తమ బతుకులు మార్చాలని.. ఆ సింఫుల్ లాజిక్ మిస్ అయితే ఎలా రాజగోపాల్?