Begin typing your search above and press return to search.

తమ్ముడి పార్టీ మార్పుపై అన్న షాకింగ్‌ రియాక్షన్‌!

కాగా తన సోదరుడు రాజగోపాల రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిక విషయం గురించి తనతో మాట్లాడలేదని ఆయన సోదరుడు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   25 Oct 2023 10:47 AM GMT
తమ్ముడి పార్టీ మార్పుపై అన్న షాకింగ్‌ రియాక్షన్‌!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ పార్టీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

కాగా తన సోదరుడు రాజగోపాల రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిక విషయం గురించి తనతో మాట్లాడలేదని ఆయన సోదరుడు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయంపై రాజగోపాల్‌ రెడ్డి అధిష్టానంతోనే మాట్లాడుకున్నారని తెలిపారు. కేవలం తన సోదరుడే కాదని.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని వెల్లడించారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కర్ణాటకలో తమ పార్టీ హామీ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ రెండో జాబితా ఈ రోజు ఫైనలైజ్‌ అవుతుందని.. రేపు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈ ఆరు స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారని వెల్లడించారు.

కాగా గతంలోనే కాళేశ్వరంపై విచారణ జరపాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గుర్తు చేశారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదన్నారు. మిర్యాలగూడలో కూడా అడిగారని వెల్లడించారు. అయితే అక్కడ ఓటు ఎంత వరకు బదిలీ అవుతుందనేది చూడాలని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ పొత్తులపై బుధవారం సాయంత్రానికి స్పష్టత వస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ పేరు ఎత్తే అర్హత కేటీఆర్‌ కు లేదన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదన్నారు. మరి కేటీఆర్‌ కు ఉన్న ఆస్తులెంతో చెప్పాలని సవాల్‌ విసిరారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని తెలిపారు.