దిల్ రాజు మాత్రమే విషెస్ చెప్పారు... మంత్రి ఆసక్తికరవ్యాఖ్యలు!
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో మంత్రులుగా ఎంపికైనవారు ఒక్కొక్కరూ బాధ్యతలు చేపడుతున్నారు
By: Tupaki Desk | 11 Dec 2023 7:09 AM GMTతెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో మంత్రులుగా ఎంపికైనవారు ఒక్కొక్కరూ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సమయంలో నల్గొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇందులో భాగంగా ఆయనకు సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బీ శాఖలను కేటాయించారు.
దీంతో ఆయన ఆదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రిగా తన కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెంకట రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తనకు సినిమా ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు మినహా మరెవరూ ఫోన్ చేయలేదని అన్నారు! ప్రస్తుతం అమెరికాలో ఉన్న దిల్ రాజు మాత్రం ఫోన్ చేసి కంగ్రాట్యులేషన్స్ చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు. దీంతో... ఈ వ్యాఖ్యలపై అసక్తి నెలకొంది. దిల్ రాజు విషెస్ చెప్పారని చెప్పాలనుకున్నారా.. లేక, మరెవరూ చెప్పలేదని చెప్పాలనుకున్నారా అనే చర్చ మొదలైంది.
ఇదే సమయంలో ఆర్ & బీ మంత్రిగా తెలంగాణ రహదారులను అభివృద్ధి చేస్తామని, ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని.. హైదరాబాద్ - విజయవాడ రహదారిని ఆరు లేన్ల హైవేగా విస్తరించేందుకు ఆమోదం తెలపాలని కోరతానని అన్నారు. ఇదే సమయంలో 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్రాన్ని కోరతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... కీలకమైన తొమ్మిది ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో నాలుగు లైన్ల రహదారులుగా మార్చబోతున్నామని తెలిపారు. ఇక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. తనకున్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో... ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలని అన్నారు. ఈ విషయాలపై పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు.