పాపం కొణతాల...మరోసారి సారీ...!
అయితే తాను ఎంపీగా పోటీ చేస్తే కొణతాల మద్దతు తీసుకోవడానికే నాగబాబు వచ్చారు అని అంటున్నారు. జనసేన నేతగా ఉన్న కొణతాల ఏమి హామీ ఇచ్చారు అన్నది తెలియరాలేదు.
By: Tupaki Desk | 18 Feb 2024 3:35 AM GMTఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ కొణతాల రామక్రిష్ణ. ఆయన రాజకీయ జీవితం వయసు మూడున్నర దశాబ్దాలు. ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. అయితే పదేళ్ళుగా మాత్రం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటున్నారు. 2014లో వైసీపీలో అన్నీ తానే అయి చక్రం తిప్పిన కొణతాల అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తన తమ్ముడిని పోటీకి నిలిపారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడారు.
ఇక 2019 నాటికి ఆయన వైసీపీలో లేరు. టీడీపీకి మద్దతుగా వచ్చినా అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ టికెట్ కానీ దక్కలేదు. చివరికి టీడీపీకి ఎన్నికల ప్రచారం చేసి పెట్టారు. నాలుగేళ్ళ పాటు మళ్లీ అజ్ఞాతవాసం గడిపారు. ఇటీవలే ఆయన బయటకు వచ్చారు. అన్నీ ఆలోచించుకుని జనసేనలో చేరారు. ఎందుకంటే టీడీపీలో తన రాజకీయ ప్రత్యర్ధి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేరిపోయారు. దాంతో పాటు అక్కడ చాలా మంది ఆశావహులు ఉన్నారు.
జనసేనలో చేరితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కించుకోవచ్చు అన్నది కొణతాల ఆలోచనగా చెబుతున్నారు. తీరా చూస్తే ఆయన ఆశలు గల్లంతు అయ్యేట్లున్నాయి. అనకాపల్లి ఎంపీ సీటుకు ఏకంగా మెగా బ్రదర్ నాగబాబు పోటీలోకి దూసుకుని వచ్చేశారు. ఆయన పవన్ అన్నయ్య, పైగా జనసేనలో కీలకం. ఆయనకు కచ్చితంగా ఎంపీ టికెట్ గ్యారంటీ.
ఈ పరిణామాల నేపధ్యంలో కొణతాల కాస్తా అయోమయంగానే ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాగబాబు తాజాగా కొణతాల రామక్రిష్ణ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇద్దరూ ఉత్తరాంధ్రా రాజకీయాల గురించి చర్చించుకున్నారు అని వార్తలు వచ్చాయి.
అయితే తాను ఎంపీగా పోటీ చేస్తే కొణతాల మద్దతు తీసుకోవడానికే నాగబాబు వచ్చారు అని అంటున్నారు. జనసేన నేతగా ఉన్న కొణతాల ఏమి హామీ ఇచ్చారు అన్నది తెలియరాలేదు. మరో వైపు చూస్తే గత వారం అంతా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు సభల్లో కొణతాల ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆయన ఇంటికి నాగబాబు స్వయంగా వెళ్ళి మాట్లాడి వచ్చారు అని అంటున్నారు.
బలమైన గవర సామాజిక వర్గంలో పట్టు ఉన్న కొణతాల రామక్రిష్ణకు నిజాయతీపరుడిగా మంచి నేతగా వివాదరహితునిగా గుర్తింపు ఉంది. ఆయన అండ ఉంటే జనసేనకు అది మంచి బలమే అవుతుంది. అయితే కొణతాల వరకూ ఎలా ఉన్నా ఆయన అనుచరులు మాత్రం మధనపడిపోతున్నారు
తమ నాయకుడు ఈసారి అయినా ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెడతారు అనుకుంటే ఇపుడు ఏమిటి ఇలా అని వారు వాపోతున్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొణతాలకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కానీ కొణతాల ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి మాత్రం ఈ ఎన్నికలతో మరోసారి ఫుల్ స్టాప్ పడింది అని అంటున్నారు.