Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కొణతాల రాక... దాడి ఫ్యామిలీకి చెక్...?

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ నుంచి యోధానుయోధులు రాజకీయాలు చేసారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 3:36 AM GMT
వైసీపీలోకి కొణతాల రాక... దాడి ఫ్యామిలీకి చెక్...?
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ నుంచి యోధానుయోధులు రాజకీయాలు చేసారు. ఇక ప్రత్యేకంగా బలమైన గవర సామాజిక వర్గం అనకాపల్లిలో డామినేటింగ్ రోల్ లో ఉంటుంది. పార్టీలు ఏవైనా కూడా గవరలే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అత్యధిక శాతం ఉంటారు.

ఇదిలా ఉంటే అనకాపల్లి సమీప అసెంబ్లీ నియోజకవర్గాలలో పట్టు కోసం వైసీపీ చూస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు స్థానిక వైద్యురాలుగా ఉన్న భీశెట్టి సత్యవతిని తెచ్చి పోటీకి పెడితే జగన్ వేవ్ లో గెలిచారు. కానీ ఈసారి మాత్రం అలాంటి సీన్ లేదు.

పార్టీ బలంతో పాటు అభ్యర్ధి బలం కూడా చాలా ముఖ్యం. అందుకే వైసీపీ ఈసారి సమర్ధుడైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తోంది. అలా చూస్తే కనుక వైఎస్సార్ కి ఎంతో ఇష్టుడై వైసీపీ ఆరంభంలో పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణను తిరిగి వైసీపీలోకి తీసుకుని రావాలని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కొణతాల రామక్రిష్ణ మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1989లో అనకాపల్లి నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున మొదటిసారి గెలిచారు. ఆనాడు కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కారు. ఇక 1991లో మరోసారి గెలిచి అయిదేళ్ళ పాటు ఎంపీగా కొనసాగారు. ఇదిలా ఉంటే 2004లో కొణతాల అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

వైఎస్సార్ మరణాంతరం ఆయన వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. విశాఖ నుంచి ఎంపీగా 2014లో వైఎస్ విజయమ్మను పోటీ చేయించడంలో కొణతాల ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఆమెను గెలిపించలేకపోయారు. దాంతో వైఎస్ జగన్ తో గ్యాప్ పెరిగి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరాలనుకున్నా కొణతాలకు కుదరలేదు.

ఇపుడు కొణతాల కోసం వైసీపీయే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన్ని కనుక ఎంపీగా పోటీ చేయిస్తే అనకాపల్లి రూరల్ జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు వైసీపీకి కలసివస్తాయన్న అంచనాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా గవర సామాజిక వర్గం మొత్తం తమ వైపు ఉంటుందని కూడా లెక్క వేస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీలో గవర సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు. అయితే ఆయనకు పార్టీలో ప్రాముఖ్యత లేదని అలిగి కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. మరో వైపు దాడి తన కుమారుడికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. దాంతో అక్కడ నుంచి మంత్రి గుడివాడ అమరనాధ్ పోటీకి దిగుతున్నారు అని వైసీపీ ఆలోచిస్తోంది.

ఈ నేపధ్యంలో కొణతాలను కనుక వైసీపీలోకి తీసుకుంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అంటు మంత్రికి అనకాపల్లిలో కలసి వస్తుంది. అలాగే అనకాపల్లి ఎంపీ సీటుకు కూడా సరైన అభ్యర్ధి దొరుకుతారు అని ఆలోచిస్తున్నారుట. దీంతో ఇపుడు వైసీపీలో చేరమని కొణతాలకు రాయబారం వెళ్ళింది అని అంటున్నారు. మరి కొణతాల వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా అన్నది చూడాలి.

ఆయన టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు అని ప్రచారం సాగింది. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు వెళ్తోంది, దానికి క్యాండిడేట్ కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో కొణతాలకు వైసీపీ నుంచి బెస్ట్ ఆప్షన్ వచ్చింది అని భావించాలి. ఆయన కనుక ఓకే అంటే వైసీపీకి అంతా సెట్ అయినట్లే. అయితే కొణతాల వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తే కనుక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ నుంచి బయటకు వెళ్తారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.