మాజీ మంత్రి కొణతాల రూటు ఎటు...!?
మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ పొలిటికల్ రూట్ ఎటు వైపు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది
By: Tupaki Desk | 14 Dec 2023 3:47 AM GMTమాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ పొలిటికల్ రూట్ ఎటు వైపు అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. ఆయన కాంగ్రెస్ లో రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహరాజుగా మారి ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ తరువాతనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 2009లో ఆయన మంత్రిగా ఉండి అనకాపల్లిలో ఓడారు. ఆ తరువాత వైఎస్సార్ మరణంతో కొణతాల రాజకీయం మసకబారుతూ వచ్చింది. గట్టిగా చెప్పాలీ అంటే గత పదిహేనేళ్ళుగా ఆయన ఏ పదవిలోనూ లేక ఏ పార్టీలోనూ కుదురుగా లేక ఇబ్బంది పడుతున్న నేపధ్యం ఉంది.
వైఎస్సార్ మరణానంతరం కొణతాల వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆయన ఉండలేకపోయారు. ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆయన ఆ పార్టీలోనూ కొనసాగలేదు ఇపుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కొణతాల రాజకీయ జీవితానికి ఇవి చివరి ఎన్నికలు అని అంటున్నారు. అందుకే ఆయన ఈసారి సరైన రాజకీయ నిర్ణయం తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారని టాక్.
ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. కొణతాల 2019లో టీడీపీలోనే ఉంటూ ప్రచారం చేశారు కాబట్టి ఆ పార్టీ మనిషి కిందనే అంతా చూస్తున్నారు. అయితే ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం వల్ల మరోసారి పసుపు కండువా కప్పుకుని అఫీషియల్ గా చేరిపోతారు అని అంటున్నారు.
అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కొణతాల అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలా అయితేనే ఆయన టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. నిజానికి 2019లో కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఆన పార్టీలో చేరినా అది దక్కలేదు. ఈసారి అయినా ఆయనకు ఆ చాన్స్ ఉంటుందా అన్నది ప్రశ్నగా ఉంది.
ఇక తెలుగుదేశం పార్టీ అయితే అంగబలం అర్ధబలం ఉన్న వారినే ఏరి కోరి మరీ ఎంపీ సీటుకు పోటీ పెట్టనుంది. అలా చూసుకుంటే కనుక ఒక పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలో ఉంది. ఆయన బలమైన సామాజిక వర్గం నేపధ్యం ఉన్న వారు అని కూడా అంటున్నారు. ఒక వేళ ఆయన కాకపోతే అపుడు వేరే వారిని ఆలోచిస్తారు అని అంటున్నారు.
మరి కొణతాలకు టికెట్ ఇస్తారా అంటే ఆయన దశాబ్దన్నర కాలంగా రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు కాబట్టి ఆలోచిస్తారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కొణతాల అభిమానులు మాత్రం తమ నాయకుడు సరైన టైం లో రీ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు. మరి ఆయన టీడీపీలో చేరుతారా లేక తన పూర్వపు పార్టీ అని వైసీపీని ఎంచూంటారా అన్నది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా ఎంపీ క్యాండిడేట్ గానే కొణతాల ఉంటారు అని అంటున్నారు.