అనకాపల్లి బెల్లం ముక్క కొణతాల దేనా ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దాదాపుగా పదిహేనేళ్ళ తరువాత మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
By: Tupaki Desk | 14 April 2024 2:30 PM GMTఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దాదాపుగా పదిహేనేళ్ళ తరువాత మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన చివరి సారిగా పోటీ చేసింది 2009 ఎన్నికల్లో. అప్పట్లో కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ పోటీ చేసిన కొణతాల ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలు అయ్యారు.
ఆ తరువాత వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరడం తన తమ్ముడికి అనకాపల్లి టికెట్ ఇప్పించుకుని వైసీపీలో అంతా తానై వ్యవహరించిన సరైన ఫలితాలు రాబట్టలేక చతికిలపడ్డారు. ఆ తరువాత టీడీపీలోకి మద్దతు ప్రకటించినా 2019 లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసిన కొణతాల 2024 ఆరంభంలో హడావుడి మొదలెట్టారు అని అంటారు.
అయితే టీడీపీ వైసీపీలలో ఆయనకు రెడ్ కార్పెట్ అయితే ఎవరూ పరవలేదు. దాంతో కొత్త పార్టీగా ఉన్న జనసేన వైపు ఫోకస్ పెట్టారు. జనసేనలో ఆయన చేరారు. రాష్ట్ర మంత్రిగా ఒకనాడు ఉన్న ఇమేజ్ ని చూపించారు. అలా గాజు గ్లాస్ పార్టీలో ఆయన చేరిపోయారు. ఆ మీదట తనకు ఎంపీ టికెట్ కావాలని ఆయన టెండర్ పెట్టారని ప్రచారంలో ఉంది. ఆ సీటు విషయంలో తన తమ్ముడు నాగబాబుకు ఇప్పించుకుందామని పవన్ చూసారు. దాంతో అనకాపల్లిలో సీనియర్ నేతగా కొణతాల అవసరం ఉంటుందని భావించి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చేశారు.
ఇది కూడా అంత సాఫీగా జరగలేదు. నాగబాబు అనకాపల్లి టూర్ లో కొణతాల డుమ్మా కొట్టి తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో నాగబాబు ఆ తరువాత పవన్ ఆయన ఇంటికి వెళ్ళి మరీ బతిమాలి మరీ తమ వైపు తిప్పుకునేలా చేసారు. అలా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. అయితే అనకాపల్లి టికెట్ మీద చాలా మంది పెద్దల కన్ను ఉంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్ తోపాటు జనసేనలో అంతకు ముందు నుంచే ఉన్న పరుచూరి భాస్కరరావు అలాగే వైసీపీ నుంచి తిరిగి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుమారుడి కోసం ట్రై చేశారు.
ఈ హెవీ కాంపిటేషన్ లో చాలా సులువుగా కొణతాల జనసేన నుంచి టికెట్ సాధించడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీ పెద్దలు చెప్పారని ప్రచారంలో పాల్గొంటున్నా మనసు పెట్టి చేయడం లేదు అని అంటున్నారు మరో వైపు చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తే దానికి దాడి కుటుంబం హాజరు కాలేదు. దాంతో అలాగే విభేధాలు ఉన్నాయా అన్న చర్చ వస్తోంది.
ఇదిలా ఉంటే అనకాపల్లితో కొణతాల రాజకీయ సంబంధాలు ఎలా ఉన్న్నాయి అంటే ఆయన చాలా కాలం నుంచే అంత చురుకుగా లేరని అంటున్నారు. ఆయన ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉంటారు అని ప్రత్యర్ధులు అంటారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసినా అనకాపల్లికి చేసింది ఏమీ లేదని విమర్శలు ఉన్నాయి. ఆయన సొంత పార్టీ కార్యకర్తలను కూడా కలిసేందుకు చిక్కడు దొరకడు టైప్ లో ఉంటారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కొణతాల ఉత్తరాంధ్రా పరిరక్షణ సమితి అని ఒక సామాజిక సంస్థను పెట్టి ఈ ప్రాంతం కోసం పని చేస్తాను అని చెబుతూ వచ్చారు. కానీ విశాఖ రాజధానిగా చేస్తామని వైసీపీ ముందుకు వస్తే దానికి మద్దతు ఇవ్వలేదు. అంతే కాకుండా విశాఖ రాజధానిని పూర్తిగా వ్యతిరేకించే జనసేన కండువా కప్పుకుని పోటీ చేస్తున్నారు అని అంటున్నారు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని పట్టుదల మీద ఉన్న బీజేపీ ఉన్న కూటమిలో ఆయన ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ ని కూడా ఏ మాత్రం సాకారం చేయని బీజేపీతో పొత్తులు పెట్టుకుని జనసేన ముందుకు వెళ్తే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఉత్తరాంధ్రా పరిరక్షణ అంటే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొణతాలకు అనకాపల్లి బెల్లం ముక్క అందుతుందా అంటే చాలా రాజకీయ సమీకరణలు సరి చూడాల్సి ఉందని అంటున్నారు. కూటమిలో కో ఆర్డినేషన్ లేకపోవడం కొణతాల అభ్యర్ధిత్వం పట్ల మిగిలిన వారిలో రేగిన అసంతృప్తి చివరికి ఏమి చేస్తాయి ఏ ఫలితాన్ని ఇస్తాయన్నది చూడాలని అంటున్నారు. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్న కొణతాల ముప్పయి ఏళ్ల యువకుడు అయిన వైసీపీ అభ్యర్ధి మలసాల భరత్ తో పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరిలో విజేతలు ఎవరూ అంటే అనకాపల్లి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు.