Begin typing your search above and press return to search.

నాగార్జున పరువు నష్టం దావా.. కొండా సురేఖ నుంచి రిప్లై..!!

ఈ విషయంపై అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల నుంచి మంత్రిపై విమర్శలు వచ్చాయి! ఈ సమయంలో నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Oct 2024 5:59 AM GMT
నాగార్జున పరువు నష్టం దావా.. కొండా సురేఖ నుంచి రిప్లై..!!
X

సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలనూ ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల నుంచి మంత్రిపై విమర్శలు వచ్చాయి! ఈ సమయంలో నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాని, ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరువునష్టం పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కొండా సురేఖ నుంచి రిప్లై ఫైల్ అయ్యింది!

అవును... తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. మంత్రి సురేఖ తరుపున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. ఈ సమయంలో తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.

కాగా... నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వేసిన పిటిషన్ పై ఈ నెల 10న కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా... సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ప్రస్థావిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ కేసులో ఇద్దరు సాక్షులు సుప్రియ యార్లగడ్డ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాలను ఇప్పటికే కోర్టు నమోదు చేసింది. అక్టోబర్ 8న నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. తన కుటుంబం గురించి.. తన కుమారుడి విడాకుల గురించి ఆమె అగౌరంగా వ్యాఖ్యానించారంటూ నాగార్జున పేర్కొన్నారు!

ఈ నేపథ్యంలో... తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ ప్రకటించారు. ఇదే సమయంలో బీఆరెస్స్ నేత కేటీఆర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నానని మంత్రి పేర్కొన్నారు. దీంతో. ఆమెపై అదే కోర్టులో కేటీఆర్ రు.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు!