Begin typing your search above and press return to search.

ఏకమైన ఎమ్మెల్యేలు.. మంత్రిపై ఫిర్యాదు.. సొంత పార్టీలోనే సీన్ రివర్స్

గత కొంత కాలంగా కొండా సురేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం అయ్యారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 8:30 AM GMT
ఏకమైన ఎమ్మెల్యేలు.. మంత్రిపై ఫిర్యాదు.. సొంత పార్టీలోనే సీన్ రివర్స్
X

కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖపై వ్యతిరేకత ప్రారంభమైందా..? మంత్రి వైఖరిని అధిష్టానం కూడా తప్పుబడుతోందా..? సొంత జిల్లా అయిన వరంగల్ జిల్లాలోనూ ఆమెకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయా..? అందుకే.. ఎమ్మెల్యేలంతా కలిసి ఆమెపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారా..? ముందు ముందు సురేఖకు గడ్డు పరిస్థితులు తప్పవా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా కొండా సురేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం అయ్యారు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆమె.. తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హాట్‌గా మార్చేశారు. నోటి దరుసుతో చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. క్షమాపణలు చెప్పినప్పటికీ సమస్య సమసిపోగా.. చివరకు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేటీఆర్, సినీనటుడు నాగార్జున ఆమెపై పరువునష్టం దావా సైతం వేశారు. తమకు జరిగిన డ్యామేజీపై కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

కేటీఆర్‌పై, నాగార్జున ఫ్యామిలీపై సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. చివరకు టాలీవుడ్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. దాంతో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక.. కేటీఆర్ విషయంలో మాత్రం ఆమె వెనక్కి తగ్గలేదు. కేటీఆర్‌పై తన వైఖరి అలానే ఉంటుందని స్పష్టం చేశారు. దాంతో ఆ మరుసటి రోజు కూడా కేటీఆర్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. ఇక.. మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.

కట్‌ చేస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతుల డామినేషన్ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాదు.. మొన్న దసరా పండుగ వేళ గీసుకొండలో నెలకొన్న వివాదం కూడా హైకమాండ్‌కు కోపం తెప్పించినట్లు సమాచారం. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం..ఎస్సై సీట్లో కూర్చుండి కమాండింగ్ చేయడాన్ని సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. దాంతో ఆమెపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని టాక్.

ఇదిలా ఉంటే.. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కొండా వర్గీయులు ఇబ్బందులు పెడుతున్నారని వారు మున్షీకి వివరించారు. ఈ రోజు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యేలే ప్రకటించారు. దీంతో సురేఖ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. మరోవైపు.. కొండా సురేఖపై ధిక్కార స్వరం నుంచి తగ్గేది లేదంటూ వరంగల్ పరిధిలోనే ఎమ్మెల్యేలంతా రహస్య భేటీ నిర్వహించినట్లుగానూ తెలిసింది. ఆమెపై పార్టీ చర్యలు తీసుకునే వరకూ ఊరుకునేది లేదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.