Begin typing your search above and press return to search.

‘కొండా’ చుట్టూ బిగస్తున్న ఉచ్చు... ఢిల్లీకి ఎమ్మెల్యేలు..!

ఇప్పటికే కేటీఆర్, సినీనటుడు నాగార్జున ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కోగా.. దసరా పండుగ పూట పోలీస్ స్టేషన్‌లో మరింత రచ్చ చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:38 AM GMT
‘కొండా’ చుట్టూ బిగస్తున్న ఉచ్చు... ఢిల్లీకి ఎమ్మెల్యేలు..!
X

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగ్గుస్తున్నది. ఇప్పటికే కేటీఆర్, సినీనటుడు నాగార్జున ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కోగా.. దసరా పండుగ పూట పోలీస్ స్టేషన్‌లో మరింత రచ్చ చేశారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో అధిష్టానం కొండా పై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నాగచైతన్య, సమంత విడాకుల విషయమై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై పరువు నష్టం దావా సైతం వేశారు. ఇప్పుడు ఆమెపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉండడం మరింత చర్చకు దారితీసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలపై కొండా సురేఖ అజమాయిషీ చేస్తున్నారని, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని అక్కడి నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పార్టీ పరంగా పైచేయి సాధించేందుకు కావాలనే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పాలనపై విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చారని, పది నెలల్లోనే ఆమె వైఖరితో పార్టీ కేడర్ డీమోరల్ కావడం బాధాకరంగా మారిందని ఆవేదన చెందారు. రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించకుంటే జాతీయ స్థాయి వరకూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు సురేఖ వ్యవహారంపై కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. పలు లేఖల ద్వారా ఆయనకు సమస్యను వివరించారు. దీంతో ఆయన నుంచి దీపాదాస్ మున్షీకి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించాలని సూచించారని పార్టీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం.

అయితే.. కొన్ని నియోజకవర్గా్ల్లో పాత, కొత్త నేతల మధ్య వివాదం నెలకొంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం సొంత పార్టీ నేతలకు, మంత్రి మధ్య గ్యాప్ ఏర్పడడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అందుకే.. దీనిని రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే సమంత విడాకుల వ్యవహారంలో సురేఖ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్ వినిపించింది. కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఫిర్యాదులు రావడంతో సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.