Begin typing your search above and press return to search.

అది కేవలం బర్త్ డే పార్టీనే.. ఆ ప్రచారం అవాస్తవం.. కొండా సుస్మిత

తాజాగా ఈ పార్టీపై సురేఖ కూతురు సుస్మిత స్పందించారు. ఈ సందర్భంగా ఓ లేఖ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 1:30 PM GMT
అది కేవలం బర్త్ డే పార్టీనే.. ఆ ప్రచారం అవాస్తవం.. కొండా సుస్మిత
X

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రేవ్ పార్టీ దుమారం రేపింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీ రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా ఆ వివాదంపై విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. మంత్రి కొండా సురేఖ ఇంట్లో నిర్వహించిన పార్టీ సంచలనంగా మారింది.

ఇటీవల కొండా సురేఖ ఇంట్లో పార్టీ జరిగింది. ఈ పార్టీలో బీర్లు, మందు కూడా ఉందని స్వయంగా సురేఖ చెప్పడంతో వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఈ పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. అయితే.. తాజాగా ఈ పార్టీపై సురేఖ కూతురు సుస్మిత స్పందించారు. ఈ సందర్భంగా ఓ లేఖ రిలీజ్ చేశారు.

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా అమ్మ కొండా సురేఖ వ్యక్తిగత సిబ్బంది కోరిక మేరకు సంప్రదాయ పద్ధతిలో వారికి విందు ఇచ్చామని వెల్లడించారు. ఆ కార్యక్రమంలో ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ.. అక్రమ పూరితమైన మద్యం కానీ లేదని స్పష్టం చేశారు. బహిరంగంగా ఏర్పాటు చేసిన విందే అని, కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. ‘మా అమ్మ సురేఖ తన వ్యక్తిగత సిబ్బందిని ఎంతగానో ప్రేమిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మా పాప పుట్టిన రోజు వేడుకలపై మా అమ్మ నేను బహిరంగంగానే మాట్లాడుకున్నాం’ అని వివరించారు.

పాప బర్త్ డే సందర్భంగా సిబ్బందికి విందు ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి రహస్యం లేదని, ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ఇది రేవ్ పార్టీ అస్సలు కాదని, ఈ పార్టీలో నిషేధిత వస్తువులు వాడలేదని పేర్కొన్నారు. ఇది కేవలం తమ ఫ్యామిలీ పార్టీ అని తెలిపారు. ఈ పార్టీపై విమర్శించే అంత ఏమీ లేదని పేర్కొన్నారు. తమ స్టాఫ్‌ను తాము ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటామని, వారు సైతం పార్టీకి హాజరయ్యారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సరికాదని పేర్కొన్నారు.